BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 5:13 pm Posted by : Reporter Srikanth

అల్పాహార పథకం ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

గాంధీనగర్ పాఠశాలల్లో ఘనంగా అల్పాహార పథకం ప్రారంభం విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట – సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ జిల్లా    గాంధీనగర్:తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉదయం అల్పాహార పథకాన్ని గాంధీనగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు ఉదయాన్నే చేరుకున్న విద్యార్థులకు వేడివేడిగా పౌష్టికాహారంతో కూడిన అల్పాహారాన్ని అందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో వరుసగా కూర్చొని అల్పాహారం స్వీకరించగా, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు స్వయంగా విద్యార్థులకు అల్పాహారం వడ్డించి వారిని ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కేతిరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న చాలామంది విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే పాఠశాలలకు వస్తున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు చదువుపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని అన్నారు. ఈ సమస్యను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రక్తహీనత సమస్య తగ్గేందుకు దోహదపడుతుందని, చదువుపై ఏకాగ్రత పెరిగి పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలలకు పంపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుర్ర సమ్మయ్య, వార్డు సభ్యులు ఎల్లయ్య, పార్నదుల క్రాంతి లక్ష్మణ్, అనిత, లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, నాయకులు కనకయ్య, అరవింద్ రాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ ఛైర్మన్, సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.