మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలి – మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్)
భీమ్ ఇండియా టుడే న్యూస్ జమ్మికుంట: మహిళా సంఘాలకు రుణాలు అందించి, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వివిధ యూనిట్లను ఏర్పాటు చేయించి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) సూచించారు.
జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆర్పీలతో పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆర్పీల పనితీరును సమీక్షించిన చైర్మన్, వారికి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు అవసరమైన రుణాలు అందించడంతో పాటు, ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేలా ఆర్పీలు బాధ్యతతో పనిచేయాలని, మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని వారు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మెప్మా ఇంచార్జి టీఎంసీ మల్లీశ్వరి, సీఆర్పీలు జ్యోతి, మంజుల, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.