BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 7:24 pm Posted by : Reporter Srikanth

పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించిన ఆల్ఫోర్స్ విద్యార్థులు

క్షేత్ర పర్యటనతో వ్యవసాయం, పట్టు పరిశ్రమపై అవగాహన

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష అనుభవాన్ని అందించడంతో పాటు, సామాజిక, ప్రకృతి, వ్యవసాయ రంగాలపై అవగాహన కల్పించేందుకు విజ్ఞాన పర్యటనలు ఎంతగానో దోహదపడతాయని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.

హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాల విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా తుమ్మనపల్లి గ్రామంలోని పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వాటిపై మరింత అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల్లో పరిశీలనా శక్తి, జిజ్ఞాస, ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి విజ్ఞాన పర్యటనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో విద్యార్థులు పట్టుపురుగుల పెంపకం విధానం, మల్బరీ సాగు, పట్టుపురుగుల జీవన చక్రం, గుడ్ల నుంచి పురుగులుగా ఎదిగే దశలు, పట్టుపురుగులు గూళ్లు అల్లే విధానం, వాటి నుంచి పట్టుదారాన్ని సేకరించే ప్రక్రియ తదితర అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. పట్టు ఉత్పత్తి కోసం రైతులు అనుసరించే పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పట్టు పరిశ్రమలో రైతుల పాత్ర గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రైతు బొక్కల వేణుగోపాల్ విద్యార్థులకు పట్టుపురుగుల పెంపకంలోని వివిధ దశలను క్షేత్రస్థాయిలో వివరించారు. పట్టుపురుగుల పెంపకానికి అనుకూలమైన వాతావరణం, వాటికి అందించే ఆహారం, పురుగుల సంరక్షణ, గూళ్ల తయారీ నుంచి పట్టుదారం ఉత్పత్తి వరకు జరిగే ప్రక్రియలను తెలియజేశారు. పట్టు సాగు ద్వారా రైతులకు లభించే ఉపాధి అవకాశాలు, వ్యవసాయ అనుబంధ రంగంగా సెరికల్చర్‌కు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

విద్యార్థులు పట్టుపురుగుల పెంపకం కేంద్రంలోని వివిధ దశలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను స్వయంగా చూసి తెలుసుకోవడం ద్వారా వ్యవసాయం, పట్టు పరిశ్రమపై ఆచరణాత్మక అవగాహన పొందారు. అంతేకాకుండా రైతులు పడే శ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.