BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 2:01 pm Posted by : Reporter Srikanth

కబడ్డీ పోరులో కొండూరు జట్టు ఘన విజయం

కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన పదో తరగతి విద్యార్థిని శైలజ

భీమ్ ఇండియా టుడే న్యూస్ వరంగల్ జిల్లా క్రీడా మైదానంలో బాలికలు సైతం తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అందుకు నిదర్శనంగా దుగ్గొండి వర్సెస్ కొండూరు జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలో ఉత్కంఠభరితమైన పోరు సాగింది.

ఈ పోటీలో కొండూరు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని శైలజ తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ అద్భుతమైన నాయకత్వ ప్రతిభను కనబరిచింది. జట్టులోని క్రీడాకారిణులను సమన్వయం చేసుకుంటూ ప్రత్యర్థి జట్టుపై పైచేయి సాధించేలా ముందుండి నడిపించింది. చివరకు 24 పాయింట్లు సాధించి కొండూరు జట్టు విజయభేరి మోగించింది.

మరోవైపు దుగ్గొండి మండలం బోరాల గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని అక్షయ కబడ్డీపై ఉన్న ఆసక్తితో పట్టుదలగా పోరాడింది. తన జట్టుకు విజయం అందించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ 16 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ పోటీలో కొండూరు జట్టు 24 పాయింట్లతో విజయం సాధించగా, బోరాల జట్టు 16 పాయింట్లతో ఓటమి పాలైంది. ఓటమి ఎదురైనా అక్షయ కనబరిచిన పోరాట పటిమ, శైలజ ప్రదర్శించిన నాయకత్వ లక్షణాలు అభినందనీయమని క్రీడాభిమానులు పేర్కొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ గ్రామీణ ప్రాంత బాలికలు తమ ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేశారు.