BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 10:51 pm Posted by : Reporter Srikanth

రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కుల కల్పనకు

రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కుల కల్పనకు భూభారతి డిజిటల్ రీసర్వే

కాట్రపల్లిలో రైతులకు అవగాహన సదస్సు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజూరాబాద్, అక్టోబర్ 22,వందేళ్ల నాటి నిజాం కాలం భూ రికార్డులు శిథిలావస్థకు చేరడం, పాత రికార్డుల్లో ఉన్న కొలతలకు క్షేత్రస్థాయిలోని భూముల విస్తీర్ణాలకు మధ్య వ్యత్యాసాలు కనిపిస్తుండటంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం భూభారతి డిజిటల్ రీసర్వే చేపట్టిందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ జిల్లా ఏడీ కిషన్ రావు తెలిపారు. ఈ సర్వే ద్వారా భూముల హద్దులను కచ్చితంగా నిర్ధారించి, రైతులకు పక్కా భూ యాజమాన్య హక్కులు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

హుజూరాబాద్ మండలంలోని కాట్రపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ పెరుమాండ్ల హైమావతి అధ్యక్షతన భూభారతి డిజిటల్ రీసర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ కిషన్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో తొలి విడతగా 70 గ్రామాలను రీసర్వే కోసం నోటిఫై చేసినట్లు తెలిపారు. హుజూరాబాద్ మండలంలో నిర్వహిస్తున్న రెండో గ్రామసభ ఇదేనని పేర్కొన్నారు.

1920 నాటి సర్వే చట్టం ప్రకారం రూపొందించిన నక్షాలు, సేత్వార్లు, టిప్పన్లు ప్రస్తుతం చిరిగిపోయి, శిథిలావస్థకు చేరుతున్నాయని వివరించారు. పాత రికార్డుల ఆధారంగా భూముల హద్దులు నిర్ధారించే క్రమంలో విస్తీర్ణాల్లో తేడాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు అత్యాధునిక రోవర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూములను పునఃసర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సాంకేతికతతో భూముల హద్దులను మరింత కచ్చితత్వంతో గుర్తించవచ్చని తెలిపారు. ఒక్కో రోవర్ యంత్రం ద్వారా రోజుకు సుమారు 25 నుంచి 30 ఎకరాల వరకు కొలతలు చేపట్టనున్నట్లు వివరించారు.

కాట్రపల్లిలో 1,283 ఎకరాల భూముల సర్వే

కాట్రపల్లి గ్రామ పరిధిలో మొత్తం 1,283 ఎకరాల 8 గుంటల విస్తీర్ణం ఉండగా, ప్రస్తుతం 337 సర్వే నంబర్లు, 845 ఖాతాలు ఉన్నట్లు ఏడీ తెలిపారు. రీసర్వే ప్రక్రియ పూర్తయ్యే నాటికి సుమారు వెయ్యి వరకు కొత్త సర్వే నంబర్లు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు.

తొలుత గ్రామ శివారు హద్దులను గుర్తించి, ఆ తర్వాత ప్రభుత్వ భూములను సర్వే చేస్తామని చెప్పారు. గ్రామంలో 124 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూములు, 25 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో మూడు శిఖం భూములు, 7 ఎకరాల 13 గుంటల గ్రామకంఠం (ఆబాదీ) భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ భూముల సర్వే పూర్తయిన అనంతరం పట్టా భూముల కొలతలు చేపడతామని తెలిపారు.

పట్టా భూముల సర్వే సమయంలో రైతులు తమ పొలాల సరిహద్దుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పక్కపొలం రైతులతో కలిసి సర్వే సమయంలో క్షేత్రస్థాయిలో హాజరై తమ భూముల హద్దులను అధికారులకు చూపించాలని కోరారు. తద్వారా భవిష్యత్తులో సరిహద్దుల విషయంలో తలెత్తే వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.

క్యూఆర్ కోడ్‌తో భూధార్ కార్డు జారీ

భూభారతి డిజిటల్ రీసర్వే పూర్తయిన అనంతరం ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కలిగిన భూధార్ కార్డును జారీ చేయనున్నట్లు ఏడీ కిషన్ రావు వెల్లడించారు. దీంతోపాటు క్యూఆర్ కోడ్‌తో కూడిన ల్యాండ్ పార్సెల్ మ్యాప్ (ఎల్‌పీఎం) అందజేస్తామని తెలిపారు. ఈ విధానం ద్వారా భూముల వివరాలు, సరిహద్దులను సులభంగా గుర్తించేందుకు వీలవుతుందని చెప్పారు.

భూముల హద్దులు స్పష్టంగా నమోదు కావడం వల్ల ఇతరులు భూములను ఆక్రమించే అవకాశాలు తగ్గుతాయని, బ్యాంకు రుణాలు పొందడంతోపాటు ఎరువులు, విత్తనాల వంటి వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు.

అభ్యంతరాలకు 60 రోజుల గడువు

రీసర్వే సమయంలో పాత రికార్డులకు, క్షేత్రస్థాయిలో గుర్తించిన వివరాలకు మధ్య ఏవైనా తేడాలు ఉంటే సంబంధిత రైతులకు 9(2) నోటీసుల ద్వారా సమాచారం అందిస్తామని ఏడీ తెలిపారు. సర్వే ఫలితాలపై అభ్యంతరాలు తెలియజేసేందుకు రైతులకు 60 రోజుల గడువు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.

రైతులు సర్వే సిబ్బందికి సహకరించాలని, తమ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, భూముల అనుభవానికి సంబంధించిన వివరాలు, ఫోన్ నంబర్లను అందించాలని కోరారు. భూముల హద్దుల నిర్ధారణలో రైతులు చురుకుగా పాల్గొంటే రీసర్వే ప్రక్రియ సజావుగా పూర్తవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జక్కని నరేందర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే వెంకటరత్నం, మండల సర్వేయర్ వంశీ, ఆర్‌ఐ లక్ష్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.