BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 11:06 am Posted by : Reporter Srikanth

పోలీసు శాఖలో భారీ మార్పులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ స్పెషల్ స్టోరీ 

విధుల్లోకి 112 మంది కొత్త డీఎస్పీలు!

కొలికి వచ్చిన ప్రమోషన్ల పంచాయితీ

డీజీపీ చొరవతో వెనకి తగ్గిన సీనియర్లు

ఈగల్‌, హైడ్రా, సైబర్‌ ప్రొబేషనరీ డీఎస్పీల సేవలు

పోలీసు శాఖలో పదోన్నతుల సందడి

37 అదనపు ఎస్పీ పోస్టుల భర్తీకి ముమ్మర కసరత్తు

రాష్ట్ర పోలీసు శాఖలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది. అకాడమీలో కఠిన శిక్షణ పూర్తిచేసుకున్న 112 మంది నూతన డీఎస్పీలు త్వరలోనే ప్రొబేషనరీ అధికారులుగా విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం వీరు గ్రేహౌండ్స్‌తో పాటు ఇతర కీలక విభాగాల్లో అంతర్గత క్షేత్రస్థాయి శిక్షణ పొందుతున్నారు. చాలాకాలంగా డీఎస్పీ స్థాయి పోస్టుల నేరుగా భర్తీ జరుగకపోవడంతో శాఖలో తీవ్రమైన సిబ్బంది కొరత ఏర్పడింది.

ఈ కొత్త అధికారుల రాకతో పోలీసు విభాగానికి భారీ ఊరట లభించనున్నది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కీలక విభాగాలకు ఈ యువ అధికారుల నియామకం ద్వారా సరికొత్త బలం చేకూరనున్నది. ముఖ్యంగా సైబర్‌ నేరాలను అరికట్టేందుకు ఏర్పాటైన తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో, ఆక్రమణల నియంత్రణ కోసం తెచ్చిన హైడ్రా, అలాగే మాదకద్రవ్యాల నిరోధక ప్రత్యేక విభాగమైన ఈగల్‌ వంటి విభాగాల్లో సమర్థులైన అధికారుల అవసరం ఉన్నది. క్షేత్రస్థాయి పరిశోధనలు వేగం కావడానికి ఈ 112మంది డీఎస్పీల నైపుణ్యం ఎంతగానో ఉపయోగపడనున్నది.

డీఎస్పీల పదోన్నతుల వివాదం కొలికి

మరోవైపు సుదీర్ఘ కాలంగా నలుగుతున్న 1995, 1996 బ్యాచ్‌ డీఎస్పీల ఉద్యోగోన్నతుల వివాదం ఎట్టకేలకు కొలికి వస్తున్నది. గతంలో ఒకే విడుతలో 140మందికి సూపర్‌ న్యూమరరీ పోస్టుల కింద ప్రమోషన్లు కల్పించడంతో సీనియారిటీ సమస్యలు తలెత్తాయి. దీంతో రెండు బ్యాచ్‌ల మధ్య వివాదాలు మొదలై న్యాయస్థానాల వరకు వెళ్లాయి. ఫలితంగా ఏండ్ల తరబడి అర్హులైన అధికారులకు ప్రమోషన్లు దకక తీవ్ర నైరాశ్యం నెలకొంది.

ఈ చిక్యుముడిని విప్పేందుకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇటీవల ఆయన రెండు బ్యాచ్‌ల అధికారులతో విసృ్తత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. కోర్టు కేసులను ఉపసంహరించుకుంటే సర్వీస్‌ నిబంధనలకు లోబడి అందరికీ సమన్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ హామీతో సానుకూలంగా స్పందించిన పలువురు అధికారులు తమ న్యాయపోరాటాలను విరమించుకునేందుకు అంగీకరించడంతో సమస్య పరిషారానికి మార్గం సుగమమైంది.

37 అదనపు ఎస్పీ పోస్టులు

ప్రస్తుతం పోలీసు యంత్రాంగంలో 37అదనపు ఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఎస్పీల ప్రమోషన్ల వివాదం సద్దుమణుగుతుండటంతో ఆ స్థానాల భర్తీకి ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు ప్రారంభించారు. డీఎస్పీలుగా ఉన్న సీనియర్లకు అదనపు ఎస్పీలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తే, ఆ స్థానాల్లో కిందిస్థాయి అధికారులైన సీఐలకు డీఎస్పీలుగా అవకాశాలు దక్కుతాయి. ఈ ప్రక్రియ క్రమబద్ధంగా సాగితే నాన్‌ క్యాడర్‌ ఎస్పీల వరకు కీలక ఖాళీలన్నీ భర్తీ అవుతాయి.

ఈ బదిలీలు, ప్రమోషన్ల పరంపర పూర్తిస్థాయిలో అమలైతే రాష్ట్రవ్యాప్తంగా పోలీసు పాలన మరింత చురుగ్గా మారనున్నది. జిల్లాలు, కమిషనరేట్లలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, క్షేత్రస్థాయి పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగుతాయి. కొత్త రక్తంతో కూడిన ప్రొబేషనరీ డీఎస్పీలు, అనుభవజ్ఞులైన అదనపు ఎస్పీల నాయకత్వంతో నాణ్యమైన సేవలు అందుతాయని భావిస్తున్నారు.