BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 4:41 pm Posted by : Reporter Srikanth

ఒకే కుటుంబంలో ఏడుగురికి ప్రభుత్వోద్యోగాలు

నిమ్స్‌లో లక్ష్మీ భాస్కర్‌ గ్యాంగ్‌..

ఓ అటెండర్‌, ఆయన భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు

మనవడికి ఉద్యోగాలు పర్మినెంట్‌ దర్యాప్తులో తాజాగా వెల్లడైన బాగోతం

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్‌ : ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం దొరకటమే గగనం. అందులోనూ ఒకే కుటుంబంలోని ఇద్దరికి లభించటం అంటే ఇంకా అరుదు. కానీ, ఒక కుటుంబంలో ఇద్దరికి కాదు.. ముగ్గురికి కాదు.. ఏకంగా, ఏడుగురికి పర్మినెంట్‌ ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఈ వింత నిమ్స్‌లో జరిగింది. అక్రమాస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీభాస్కర్‌ లీలల్లో ఇదొకటని తెలుస్తోంది. నిమ్స్‌లో పనిచేసే ఓ అటెండర్‌తోపాటు అతని భార్య, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవడికి లక్ష్మీభాస్కర్‌ ద్వారా ఉద్యోగాలు పర్మినెంట్‌ అయ్యాయని వెల్లడైంది. ఒకే కుటుంబంలో ఏడుగురికి ఉద్యోగాలు ఇచ్చిన ‘ఘనత’ లక్ష్మీభాస్కర్‌, ఆయన గ్యాంగ్‌దని దర్యాప్తు అఽధికారులు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. అక్రమాస్తుల కేసులో లక్ష్మీభాస్కర్‌ అరెస్టు, ఆయన బినామీల గుట్టు రట్టు నేపథ్యంలో.. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో నిమ్స్‌లో 2014 నుంచి 2023 వరకు జరిగిన అక్రమాలపై, కొనుగోళ్లు తదితర విభాగాల్లో చోటుచేసుకున్న ఆర్థిక అవకతవకలపై.. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఏంఓ) ఆదేశాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ ప్రారంభించారు

ఒకవైపు ఏసీబీ కేసులు, మరోవైపు విజిలెన్స్‌ విచారణతో నిమ్స్‌లో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా మూడు విభాగాలకు సంబంధించిన కొన్ని కీలక కొనుగోళ్లపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. లక్ష్మీభాస్కర్‌ ఆధ్వర్యంలో జరిగిన స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ ఉద్యోగుల నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, లక్షలు రూపాయల చొప్పున తీసుకుని పోస్టింగ్‌లు ఇచ్చారన్న ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.

కాగా, లక్ష్మీ భాస్కర్‌ను ఈనెల 13నుంచి 15వ తేదీ వరకు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించినప్పటికీఆయన సహాయ నిరాకరణ చేయడంతో, తమదైన శైలిలో బినామీల గుట్టును కొంతవరకు ఏసీబీ అధికారులు లాగారని సమాచారం. నిమ్స్‌ మాజీ ఉన్నతాధికారి, మాజీ సలహాదారుతో లక్ష్మీభాస్కర్‌కు ఉన్న ఆర్థిక బంధం అంశాన్ని నిర్ధారించుకోవడానికి మరోసారి ఆయనను కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ త్వరలో ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.