BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 12:24 pm Posted by : Reporter Srikanth

కాలినడకన జమ్మి చెట్టు వద్దకు

భీమ్ ఇండియా టుడే న్యూస్  హైదరాబాద్ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొని పండుగ సంబరాలను మరింత ప్రత్యేకంగా మార్చారు. సొంత ఊరి ప్రజల మధ్య ఆత్మీయంగా గడుపుతూ, పెద్దలు, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ, గ్రామస్థులతో సరదాగా ముచ్చటిస్తూ పండుగ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. 

ముఖ్యమంత్రి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహభరితంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు, అభిమాన పలకరింపులతో కొండారెడ్డిపల్లి పల్లె పండుగ శోభను సంతరించుకుంది.

సాయంత్రం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని కోట మైసమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి కాలినడకన జమ్మి చెట్టు వద్దకు బయలుదేరారు. 

దారిపొడవునా గ్రామస్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జమ్మి చెట్టు వద్దకు చేరుకున్న అనంతరం సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆప్యాయతను పంచుకుంటూ, ఆత్మీయతను చాటుకుంటూ సాగిన ఈ వేడుకలు పల్లె సంప్రదాయాల గొప్పతనాన్ని మరోసారి చాటిచెప్పాయి. ముఖ్యమంత్రి గారి రాక సందర్భంగా కొండారెడ్డిపల్లిలో గ్రామస్థులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. 

పండుగ సందడితో కళకళలాడిన పల్లెలో బతుకమ్మ ఆటపాటలు, ఆత్మీయ పలకరింపులు, సంప్రదాయ ఆచారాలు, ఆనందోత్సాహాలు కలగలిసి విజయదశమి వేడుకలను చిరస్మరణీయంగా మార్చాయి.

ప్రజల మధ్య.. తన ఊరి ఒడిలో.. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి ముఖ్యమంత్రి గడిపిన ఈ దసరా పండుగ సమయం కొండారెడ్డిపల్లిలో ఆత్మీయతకు, అనుబంధాలకు, పల్లె సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.