BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 7:00 pm Posted by : Reporter Srikanth

యువకుడు డాక్టర్ సాయి పవన్ తన ప్రతిభను చాటుకున్నారు.

న్యాయమూర్తిగా మల్లారం యువకుడు.. న్యాయరంగంలో ప్రతిభ చాటిన యువ న్యాయవాది

భీమ్ ఇండియా టుడే న్యూస్ భీమదేవరపల్లి మండలం పట్టుదల, కృషితో న్యాయరంగంలో వరుస విజయాలు సాధిస్తూ మల్లారం గ్రామ యువకుడు డాక్టర్ సాయి పవన్ తన ప్రతిభను చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సివిల్ జడ్జి నియామక పరీక్షలో అర్హత సాధించి న్యాయమూర్తిగా ఎంపిక కావడంతో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డాక్టర్ సాయి పవన్ న్యాయరంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తన లక్ష్యాన్ని సాధించారు. నాలుగు రోజుల క్రితమే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) నియామక పరీక్షలోనూ అర్హత సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నారు. తాజాగా సివిల్ జడ్జి నియామక పరీక్షలో కూడా విజయం సాధించడం ఆయన కృషికి నిదర్శనంగా నిలిచింది.

సాయి పవన్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న అనంతరం న్యాయవృత్తిపై ఆసక్తితో న్యాయవిద్యను అభ్యసించారు. న్యాయశాస్త్రంపై పట్టు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆయన సాధించిన విజయాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు కీలక నియామక పరీక్షల్లో అర్హత సాధించడం విశేషంగా నిలిచింది. ముఖ్యంగా సివిల్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, కులసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మల్లారం గ్రామానికి చెందిన యువకుడు న్యాయమూర్తిగా ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని స్థానికులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో న్యాయరంగంలో మరిన్ని విజయాలు సాధించి ప్రజలకు న్యాయసేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే లక్ష్యాలను సాధించవచ్చని డాక్టర్ సాయి పవన్ విజయం నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.