BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 6:43 pm Posted by : Reporter Srikanth

దళిత బంధు రెండో విడతను వెంటనే అమలు చేయాలి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులతో పాటు తులం బంగారం అందించాలి

రైతులకు 24 గంటల విద్యుత్ అందించి, కాళేశ్వరం నీటిని వెంటనే విడుదల చేయాలి కమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలి

భీమ్ ఇండియా టుడే న్యూస్ కమలాపూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు.

చెక్కులతో పాటు తులం బంగారం అందించాలి

పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేశారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు తెలిపారు. ఈ పథకాల ద్వారా వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రూ.1,00,116 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చెక్కులతో పాటు తులం బంగారాన్ని కూడా వెంటనే అందించి పేద కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలి.. కాళేశ్వరం నీటిని విడుదల చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం రైతులకు కేవలం 7 గంటలే విద్యుత్ అందిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో పాటు కాళేశ్వరం ద్వారా సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు.

దళిత బంధు రెండో విడత వెంటనే అమలు చేయాలి

దళిత కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెంది స్వయం ఉపాధితో గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత దళిత బంధును నిలిపివేయడంతో అర్హులైన దళిత కుటుంబాలు ఎదురుచూస్తూ ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. దళితుల అభ్యున్నతిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రెండో విడత దళిత బంధును అమలు చేసి అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలను పునఃప్రారంభించాలి

గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకాలు తల్లీబిడ్డలకు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఆడపిల్ల పుడితే రూ.12,000, మగపిల్లాడు పుడితే రూ.13,000 ఆర్థిక సహాయం అందించే పథకాల ప్రయోజనాలు ప్రజలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిలిపివేసిన పథకాలను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.

కమలాపూర్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

కమలాపూర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసినప్పటికీ, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా పంపిణి చేసారు అని ఎమ్మెల్యే తెలిపారు. సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

బస్‌స్టాండ్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలి

కేసీఆర్ హయాంలో కమలాపూర్ బస్‌స్టాండ్ నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తికాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే అవసరమైన నిధులు మంజూరు చేసి బస్‌స్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వానికి ప్రాధాన్యత కావాలి

ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, పేద కుటుంబాలు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం అందించాలని, దళిత బంధు రెండో విడత అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన విద్యుత్, సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కమలాపూర్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.