భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ఆర్‌జీఐఏలో రూ.2.25 కోట్ల విదేశీ బంగారం స్వాధీనం దుస్తుల కింద ప్రత్యేక పౌచ్‌లో దాచిన 1.48 కిలోల బంగారం.. ప్రయాణికుడి అరెస్ట్
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ)లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,481.780 గ్రాముల బంగారం పట్టుబడగా, దీని విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
నిర్దిష్ట సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టగా.. తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఆరు బంగారం ముక్కలు గుర్తించారు. బంగారాన్ని బ్లూ టేప్, కార్బన్ పేపర్‌తో చుట్టి, దుస్తుల కింద ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లో దాచినట్లు అధికారులు గుర్తించారు.
విచారణలో విదేశీ ప్రయాణ దశలోనే విమానంలో బంగారాన్ని దాచినట్లు, అనంతరం హైదరాబాద్‌కు వెళ్లే దేశీయ ప్రయాణంలో దాన్ని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వెల్లడించారు. విమానంలో దాచిన బంగారాన్ని తానే తీసుకున్నట్లు ప్రయాణికుడు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు.
దీంతో కస్టమ్స్ యాక్ట్, 1962 కింద బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. అక్టోబర్ 6న సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.