BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 12:20 pm Posted by : Reporter Srikanth

ప్రమోషన్‌ కోసం పాతికేళ్ల నిరీక్షణ!

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో ఎస్‌జీటీలు 25–30 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితిపై విశ్లేషణ.. 30 ఏళ్ల సర్వీసుకు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌, ప్రమోషన్లు, వేతన ప్రయోజనాలపై ఉపాధ్యాయుల డిమాండ్లు.

విద్యాబోధనలో కీలక పాత్ర పోషిస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) ఉద్యోగ జీవితంలో మాత్రం ఎదుగుదల కరువైంది. మారుమూల గ్రామాలు, తండాల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నా.. పదోన్నతి కోసం పాతికేళ్లకు పైగా ఎదురు చూడా ల్సిన పరిస్థితి నెలకొంది. చివరకు ప్రమోషన్‌ వచ్చినా ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కడం లేదు.. దశాబ్దాల సర్వీస్‌కు గుర్తింపుగా కనీసం 30 ఏళ్ల ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ అయినా కల్పించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది.

రాష్ట్రంలో ఎస్‌జీటీలుగా దాదాపు 40 వేల మంది వరకు పనిచేస్తున్నారు.. మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో పైస్థాయి పోస్టులకు పదోన్నతులు లభిస్తుంటే.. విద్యా శాఖలో ఎస్‌జీటీలకు మాత్రం ఒక ప్రమోషన్ కోసం 25 నుంచి 30 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఎస్‌జీటీగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన వారు ఉద్యోగ విరమణకు చేరువయ్యే వరకు అదే పోస్టులో కొనసాగాల్సి రావడం దురదృష్టకరం. 2000 సంవత్సరంలో ఎస్‌జీటీగా నియామకమైన వేలాది మంది ఇప్పటికీ అదే పోస్టులో కొనసాగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..

ప్రమోషన్ ఆలస్యం.. వేతన ప్రయోజనాల్లోనూ నష్టం!

2002 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఎస్‌జీటీలు 2002 అక్టోబర్‌ 17న విధుల్లో చేరారు. ఈ ఏడాది అక్టోబర్‌ 16 నాటికి వారికి దాదాపు 24 ఏళ్ల సర్వీస్‌ పూర్తవుతుంది. ఇంత సుదీర్ఘ సేవ చేసినా పలువురికి ఇప్పటికీ పదోన్నతులు లభించలేదు.. ఎస్‌జీటీల సమస్య కేవలం ప్రమోషన్‌ రాకపోవడానికే పరిమితం కాదు. 24 ఏళ్ల సర్వీస్‌ పూర్తయి ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ పొందిన తర్వాత ప్రమోషన్‌ వస్తే ఎఫ్‌ఆర్‌ 22(బి) వర్తించదు. దీంతో రెండు ఇంక్రిమెంట్లకు బదులు ఒక్క ఇంక్రిమెంట్‌ మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా, ప్రమోషన్‌ పొందిన కొత్త పోస్టులో మళ్లీ ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదు. 6, 12, 18, 24 ఏళ్ల సర్వీస్‌కు లభించే ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేళ్లు ఉద్యోగులకు కీలకం. 24 ఏళ్ల స్కేల్‌ పొందిన తర్వాత ప్రమోషన్‌ వస్తే కొత్త పోస్టులో ఈ ప్రయోజనాలు లేకపో వడంతో దీర్ఘకాలికంగా ఆర్థిక నష్టం కలుగుతోంది.

ఏపీలో కాస్త మెరుగైన పరిస్థితి!

ఎస్‌జీటీలు సర్వీస్ పరంగా మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు.. 25–30 ఏళ్ల సర్వీస్‌ చేసినా ప్రమోషన్‌ రాకపోవడం, 24 ఏళ్ల స్కేల్‌ తర్వాత ప్రమోషన్‌ వస్తే ఎఫ్‌ఆర్‌ 22(బి) కింద రెండు ఇంక్రిమెంట్ల ప్రయోజనం లేకపోవడం, ప్రమోషన్‌ పొందిన పోస్టులో మళ్లీ ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేళ్లు లభించక పోవడం. దీంతో ఏళ్ల తరబడి ప్రమోషన్‌ కోసం ఎదురుచూసినా, పదోన్నతి వచ్చిన తర్వాత కూడా ఆశించిన ఆర్థిక ప్రయోజనం దక్కడం లేదు. అయితే 24 సంవత్సరాల స్కేల్ పొందిన తర్వాత కూడా ఎఫ్‌ఆర్‌ 22(బి) వంటి వేతన ప్రయోజనాలు, పై పోస్టులో ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్‌కు సంబంధించిన ప్రయోజనాలు లభించే విధానం ఏపీలో ఉంది. ఏపీలో 30 సంవత్సరాల సర్వీస్‌కు కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్ అందుబాటులో ఉండటం అక్కడి ఎస్‌జీటీలకు ఊరట కలిగిస్తోంది. ఎస్‌పీపీ-1ఏ, ఎస్‌పీపీ-1బీ తరహాలోనే ఎస్‌పీపీ-2ఏ, ఎస్‌పీపీ-2బీ ప్రయోజనాలు అందుబాటులో ఉండటం వల్ల సుదీర్ఘకాలం ఒకే పోస్టులో పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది. తెలంగాణలో మాత్రం 24 సంవత్సరాల స్కేలే గరిష్ట ప్రయోజనంగా ఉన్న నేపథ్యంలో దీర్ఘకాల సర్వీస్ చేసిన ఎస్‌జీటీలకు ఇక్కడ అన్యాయం జరుగుతోంది.

30 ఏళ్ల సర్వీసుకు స్కేల్ ఇవ్వాలి!

ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ 30 ఏళ్ల సర్వీస్‌కు ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ మంజూరు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి.. ప్రస్తుతం 6, 12, 18, 24 ఏళ్లకు ఉన్న స్కేళ్లతో పాటు 30 ఏళ్ల సర్వీస్‌కు కూడా స్కేల్‌ ఇస్తే, దీర్ఘకాలంగా ఒకే పోస్టులో పనిచేస్తున్న ఎస్‌జీటీలకు ప్రమో షన్‌ ఆలస్యమైనా వేతన వృద్ధి ఆగకుండా ఉంటుంది. ప్రస్తుతం ఎస్‌జీటీల ఆశలు పీఆర్సీ కమిషన్‌ సిఫారసులపైనే ఉన్నాయి. 30 ఏళ్ల సర్వీస్‌కు కూడా ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ ముందు బలంగా వినిపించాయి. కమిషన్‌ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరుతున్నారు.

ప్రమోషన్ కోసం ఎదురు చూడొద్దు!

అదే సమయంలో ఎస్‌జీటీలు 25–30 ఏళ్ల పాటు ప్రమోషన్‌ కోసం ఎదురుచూసే పరిస్థితికి ముగింపు పలకాలి. గతంలో ఇచ్చిన హామీ మేరకు 10,000 ఎస్‌జీటీ పోస్టులను ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం పోస్టులుగా అప్‌గ్రేడ్‌ చేసి వెంటనే పదోన్నతులు కల్పించాలి. దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యారంగానికి సేవలందిస్తున్న ఎస్‌జీటీలకు కనీసం 30 ఏళ్ల ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్‌ మంజూరు చేస్తే వారి ఆవేదనకు కొంత ఉపశమనం లభి స్తుంది. ఇన్నేళ్ల సేవకు గుర్తింపుగా ఈ డిమాండ్‌పై ప్రభు త్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.