BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 11:58 am Posted by : Reporter Srikanth

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు

ప్రముఖ సాహితీవేత్త మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం

భీమ్ ఇండియా టుడే | హైదరాబాద్ ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు.

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ తెలుగు సాహిత్యంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న గొప్ప రచయితగా గుర్తింపు పొందారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నవలా రచయితగా, చరిత్ర పరిశోధకుడిగా, సాహిత్య విమర్శకుడిగా, వ్యాసకర్తగా ఆయన చేసిన కృషి తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో దోహదపడిందని కొనియాడారు. విభిన్న సాహిత్య ప్రక్రియల్లో తన ప్రతిభను చాటుతూ పాఠకుల ఆదరణ పొందారని గుర్తుచేశారు.

తన రచనలు, పరిశోధనల ద్వారా తెలుగు పాఠకుల్లో మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఆచార్య ముదిగొండ శివప్రసాద్ విశేష కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఆయన అందించిన సేవలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆచార్య ముదిగొండ శివప్రసాద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన ముఖ్యమంత్రి, ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సాహితీ సహచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి, అందించిన సేవలు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.