యాసంగి సీజన్‌కు సబ్సిడీపై పెసర, మినుము విత్తనాల పంపిణీ
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీ ఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి సీజన్‌లో రైతులకు సబ్సిడీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించారు. అనంతరం ఎల్కతుర్తి రైతు వేదికలో ఏ.డి.ఏ ఆదిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఇంద్రసేనారెడ్డి రైతులకు పెసర, మినుము విత్తనాలను పంపిణీ చేశారు.
యాసంగి సాగుకు రైతులకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బావుపేట సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్, మండల వ్యవసాయ అధికారి ఎం. రాజ్‌కుమార్, ఏఈఓ ఎం. పున్నంచందర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.