BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:57 pm Posted by : Reporter Srikanth

సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

అశేష జనసందోహం మధ్య 3 కి.మీ.లకు పైగా కొనసాగిన ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమం

భీమ్ ఇండియా టుడే న్యూస్ సిరిసిల్ల: ప్రజా పాలన–ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్ల పట్టణంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన పాదయాత్రకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రగుడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకు ఈ పాదయాత్ర 3 కిలోమీటర్లకు పైగా కొనసాగింది. మార్గమధ్యంలో ప్రజలు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రజలు పెద్దఎత్తున నడిచారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సిరిసిల్ల పట్టణ వీధుల్లో సాగిన ఈ పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం రగుడు ప్రాంతంలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.