బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాప్‌లలోనే ఫేస్ అథెంటికేషన్
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా యూఐడీఏఐ కొత్త ఫేస్ అథెంటికేషన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఇకపై ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర ప్రత్యేక యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ వంటి యాప్‌లలోనే ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను వినియోగించుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఒకే యాప్‌లో కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునే వీలు కలుగుతుంది.
ఈ సదుపాయం ద్వారా డిజిటల్ కేవైసీ ప్రక్రియతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మరింత వేగవంతం కానుంది. ఆధార్ ఆధారిత సేవలను వినియోగించే సమయంలో వినియోగదారులకు ఎదురయ్యే అదనపు దశలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారిత లైవ్‌నెస్ డిటెక్షన్ సాంకేతికతను ఉపయోగించడం ద్వారా నకిలీ ఫొటోలు, వీడియోలను ఉపయోగించి జరిగే మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆధార్ ఆధారిత డిజిటల్ గుర్తింపు ప్రక్రియ మరింత సురక్షితంగా మారే అవకాశం ఉంది.