BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 7:20 pm Posted by : Reporter Srikanth

NH-563పై కోతుల నడుమ గ్రామ ప్రజల ధర్నా

రోడ్డు క్రాసింగ్, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 26:జాతీయ రహదారి NH-563 నిర్మాణంతో తమ గ్రామానికి రాకపోకల ఇబ్బందులు తీవ్రంగా పెరిగాయని ఆరోపిస్తూ కోతుల నడుమ గ్రామ ప్రజలు శనివారం ధర్నా నిర్వహించారు. గ్రామానికి రోడ్డు క్రాసింగ్ సౌకర్యం కల్పించాలని, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. తమ గ్రామానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల పెంపకదారులు, ట్రాక్టర్ల రాకపోకలు నిత్యం NH-563 రహదారి అవతల ఉన్న వ్యవసాయ భూముల వైపు కొనసాగుతాయని తెలిపారు. అయితే రహదారి నిర్మాణం సమయంలో గ్రామ ప్రజలకు రోడ్డు క్రాసింగ్ సౌకర్యం, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్లడంతో పాఠశాల, సుమారు 70 ఇళ్లు, బస్టాండ్, వాటర్ బోర్లు తదితర సౌకర్యాలు కోల్పోయామని గ్రామస్తులు తెలిపారు. గ్రామం పక్కనే వాగు ఉండటంతో భారీ వర్షాలు కురిసి వరద వచ్చిన సమయంలో గ్రామ ప్రజలు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రజల ప్రాణ భద్రత, రాకపోకల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా?” అని గ్రామస్తులు ప్రశ్నించారు. పలుమార్లు ధర్నాలు, వినతులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు, ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్రామ ప్రజల న్యాయమైన డిమాండ్లను వెంటనే గుర్తించి NH-563పై సురక్షితమైన రోడ్డు క్రాసింగ్, సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి గ్రామానికి తగిన రాకపోకల సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

గ్రామ ప్రజలు శాంతియుతంగా నిర్వహించిన ధర్నాను ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు, విఠల్‌రావు, అఖిల్, భాస్కర్ తదితరులు అక్కడికి చేరుకుని ప్రజలతో మాట్లాడి, సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతియుతంగా ధర్నాను విరమించారు.