ఇక ఇంటికే మీసేవ సర్వీసులు.. డోర్ డెలివరీ సేవలు ప్రారంభం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇకపై ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దకే మీసేవ సేవలను అందించే డోర్ డెలివరీ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.
1100కు ఫోన్ చేస్తే.. ఇంటికే మీసేవ ఎగ్జిక్యూటివ్
మీసేవ డోర్ డెలివరీ సేవలను పొందేందుకు ప్రజలు 1100 నంబర్‌కు ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే మీసేవ పోర్టల్ ద్వారా కూడా తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. బుక్ చేసుకున్న సమయంలో మీసేవ ఎగ్జిక్యూటివ్ నేరుగా వినియోగదారుల ఇంటికి వెళ్లి అవసరమైన సేవలను అందించనున్నారు.
పలు ధృవీకరణ పత్రాలు ఇంటివద్దే
డోర్ డెలివరీ విధానంలో భాగంగా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు ఇంటివద్దే అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం వంటి సేవలను పొందేందుకు ప్రజలు మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
అదేవిధంగా ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) కాపీలు, పోలీస్ శాఖకు సంబంధించిన పలు సేవలు కూడా ఇంటివద్దకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఐజీఆర్‌ఎస్ సేవలు కూడా ఈ విధానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
70 మందికి పైగా ఏజెంట్లకు శిక్షణ
డోర్ డెలివరీ సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే 70 మందికి పైగా మీసేవ ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు సేవలు అందించే సమయంలో అవసరమైన విధివిధానాలు, సాంకేతిక ప్రక్రియలపై వారికి శిక్షణ అందించారు.
తొలిదశలో పైలట్ ప్రాజెక్ట్
మీసేవ డోర్ డెలివరీ సేవలను తొలుత ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఈ విధానంలో ఎదురయ్యే సమస్యలు, ప్రజల స్పందనను పరిశీలించిన అనంతరం సేవలను మరింత విస్తరించనున్నారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు
పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మీసేవ డోర్ డెలివరీ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. దీంతో వృద్ధులు, దూర ప్రాంతాల్లో ఉన్నవారు, మీసేవ కేంద్రాలకు వెళ్లలేని ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉంది.
ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్లే లక్ష్యంతో ప్రారంభించిన ఈ డోర్ డెలివరీ విధానం ద్వారా సమయం, ప్రయాణ ఖర్చు ఆదా కావడంతో పాటు మీసేవ సేవలు మరింత సులభతరం కానున్నాయి.