జోరుగా కురిసిన వర్షంతో పులకించిన పల్లెలు – వరి పంటపై మళ్లీ ఆశలు పెంచుకున్న రైతులు
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి: వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న వేళ ఒక్కసారిగా కురిసిన వర్షం రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపింది. ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో వరి పంటపై రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
కొంతకాలంగా సరైన వర్షాలు లేకపోవడంతో వరి పంట పరిస్థితిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడటంతో చేతికొచ్చే దిగుబడిపై సందేహాలు నెలకొన్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం రైతులకు ఎంతో ఊరటనిచ్చింది.
వర్షపు నీటితో పొలాల్లో తేమ పెరగడంతో వరి పంటకు మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పంటలు ఎండిపోతున్న సమయంలో కురిసిన ఈ వర్షం తమకు వరంగా మారిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వాన దేవుడొచ్చి వరం ఇచ్చిపోయినట్లుంది” అంటూ పలువురు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే విధంగా మరోసారి మంచి వర్షాలు కురిస్తే పంటకు అవసరమైన నీరు అందుతుందని, వరి పంట చేతికొచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కురిసిన వర్షాలతో పల్లె ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ వర్షాలు మరికొంతకాలం కొనసాగితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.