భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సుదర్శన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అధికారులు
రాష్ట్రంలోని పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రి పంపిణీపై సీఎం శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను ఈ నెలాఖరులోగా అందజేస్తామని సీఎంకు అధికారులు వివరించారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని హాస్టళ్ల విద్యార్థులకు నోటు పుస్తకాలు, ప్లేట్లు, గ్లాసులు, కార్పెట్లు, దుప్పట్లు, టవళ్ల పంపిణీ పూర్తయినట్లు అధికారులు వివరించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం(2027-28) పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రిని విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు సబ్యసాచి ఘోష్, బాల మాయాదేవి, అహ్మద్ నదీమ్, దివ్యాదేవరాజన్, నవీన్ నికోలస్, శ్రుతి ఓజా, సైదులు, సంతోష్, సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.