BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 1:42 pm Posted by : Reporter Srikanth

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ తిరంగా ర్యాలీ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు, పోరాట యోధులు చేసిన ఉద్యమాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు.

అనంతరం రాష్ట్ర నాయకులు గోస్కుల అజయ్ మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి దారితీసిన చారిత్రక పరిణామాలను విద్యార్థులు తెలుసుకోవాలని అన్నారు. నిజాం సైన్యాధిపతి సయ్యద్ అహ్మద్ ఎల్-ఎడ్రూస్ లొంగిపోవడం, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాల్పుల విరమణను ప్రకటించడం వంటి పరిణామాలతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ఈ పరిణామాల అనంతరం నిజాం పాలనకు ముగింపు పలికిందని పేర్కొన్నారు.తెలంగాణ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధుల త్యాగాలను యువత, విద్యార్థులు గుర్తుంచుకోవాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. దేశ సమగ్రత, జాతీయ ఐక్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ హుజురాబాద్ నగర కార్యదర్శి సాయి చరణ్, నగర సంయుక్త కార్యదర్శులు కుమారస్వామి, శివ, అజయ్, భార్గవ్, నగర ఉపాధ్యక్షులు చరణ్ తేజ, రాకేష్, కృష్ణ, మణిప్రీతంతో పాటు పలువురు కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.