భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ఇంధన – వాణిజ్య విభాగం ప్రకటించింది. సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పర్మనెంట్ సెక్రెటరీ ఆగస్టీన్ లీ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో సమావేశమైంది.
అసెంబ్లీలోని చాంబర్‌లో జరిగిన ఈ సమావేశంలో పారిశ్రామిక పెట్టుబడులపై చర్చలు జరిగాయి. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న సానుకూల అంశాలను ముఖ్యమంత్రి సమగ్రంగా వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక పరమైన సహకారం అందించాలని కోరారు. పెట్టుబడులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
డిసెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆగస్టీన్ లీ గారిని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
మూసీ పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగపూర్ ప్రతినిధులకు వివరించారు. తొలిదశలో మూసా, ఈసా నదుల సంగమం గాంధీ సరోవర్ వరకు మూసీ పునరుజ్జీవనం చేపడుతున్నట్టు తెలిపారు.
మూసీ రివర్ ఫ్రంట్‌తో పాటు నైట్ ఎకానమీ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేసినట్టు తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని పర్యాటకంగానే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్-జీరో సిటీగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని వివరించారు.
ఇప్పటికే హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, MIT, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
పెట్టుబడులపై సానుకూలంగా స్పందించిన సింగపూర్ ప్రతినిధి బృందం.. సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి సానుకూలంగా ఉన్నట్టు ఈ సందర్భంగా వెల్లడించింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, సింగపూర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్ గారు, సింగపూర్ కాన్సుల్ జనరల్ విలియం చిక్ గారితో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.