BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 4:38 pm Posted by : Reporter Srikanth

పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి!

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రవాహం పుస్తకావిష్కరణ

తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను గుర్తించాలి  ప్రజా సంఘాలు, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

భీమ్ ఇండియా టుడే న్యూస్ హన్మకొండ: తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యపరిచి, ప్రజా సమస్యలను తన గళం ద్వారా వినిపించిన ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని ప్రతిబింబించే “25 ఏళ్ల పాటల ప్రవాహం” పుస్తకాన్ని హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఘనంగా ఆవిష్కరించారు.

ఈ పుస్తకావిష్కరణ సభలో మేధా సురేష్‌తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ “పాటకు వాటా కావాలి.. చట్టసభలో హక్కు కావాలి” అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లారు.

ప్రజా ఉద్యమాల్లో పాటల ద్వారా కీలక పాత్ర పోషించిన కళాకారులకు రాజకీయ వ్యవస్థలో తగిన గుర్తింపు, గౌరవం దక్కాల్సిన అవసరం ఉందని సురేష్ అన్నారు. ప్రభుత్వం, రాజకీయ నాయకుల తీరుపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ప్రజల గొంతుకగా నిలిచిన కళాకారుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

పాట లేకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇంతటి ప్రజా ఉద్యమంగా మారేది కాదు” అని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏపూరి సోమన్న చేసిన త్యాగాలు, ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన చేసిన కృషిని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాటకు ఉన్న ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలని, ప్రజాగాయకులు, కళాకారులకు సముచిత గౌరవం కల్పించాలని ఆయన కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించేలా ప్రజా సంఘాలు, కళాకారులు, ఉద్యమకారులు ఐక్యంగా డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు.

ఏపూరి సోమన్న 25 ఏళ్ల పాటల ప్రస్థానాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని, తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను భవిష్యత్ తరాలకు అందించే చారిత్రక ప్రయత్నమని పలువురు పేర్కొన్నారు.