BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:12 pm Posted by : Reporter Srikanth

సూరారం గ్రామానికి అండర్‌పాస్ నిర్మించాలి

కలెక్టర్ స్పందనతో గ్రామానికి వచ్చిన అధికారులు – సమస్యలను వివరించిన రైతులు, గ్రామస్థులు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్ 11:హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామానికి వెళ్లేందుకు ఎన్‌హెచ్‌–563 రహదారి వద్ద సరైన దారి లేకపోవడంతో గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూరారం స్టేజ్ వద్ద గ్రామంలోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో నిత్యం సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యపై సూరారం గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ బచ్చు రాజేశ్వర్ రావుతో పాటు పలువురు గ్రామస్థులు ఇటీవల అనుమకొండ జిల్లా కలెక్టర్‌కు మెమోరాండం సమర్పించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శుక్రవారం సంబంధిత అధికారులను సూరారం గ్రామానికి పంపించారు.

ఎన్‌హెచ్‌–563 అధికారులు, ట్రాఫిక్ ఏసీపీ, ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు కానిస్టేబుల్ బక్కన్న తదితర అధికారులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులు, రైతులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. సూరారం నుంచి హన్మకొండకు వెళ్లి తిరిగి బస్సులో సూరారం స్టేజ్ వద్ద దిగిన తర్వాత గ్రామంలోకి రావడానికి సరైన దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

 సూరారం గ్రామ రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎన్‌హెచ్‌–563 రహదారికి ఆనుకుని ఉండటంతో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గ్రామంలో సుమారు 5 వేల నుంచి 6 వేల వరకు గేదెలు, గొర్రెలు ఉన్నాయని, వాటిని గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు నడిపించాల్సి వస్తోందని రైతులు, గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ప్రతిరోజూ ఎదురవుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సూరారం స్టేజ్ వద్ద గ్రామానికి అనుసంధానంగా అండర్‌పాస్ నిర్మించాలని రైతులు, గ్రామస్థులు అధికారులను కోరారు. గ్రామస్థుల సమస్యలను అధికారులు పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పందించినట్లు గ్రామస్థులు తెలిపారు

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తక్కళ్ల పెల్లి సంపత్ రావు మాసాడి లింగారావు, బచ్చు రాజేశ్వర్ రావు (ప్రైవేట్ టీచర్) సాబీర్.తో పాటు పలువురు గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.