నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయాలి.. రైతు సంఘాల్లో ప్రభుత్వ జోక్యం ఎందుకు?
వెంటనే జీవో రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలి: మాజీ సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ ఎలుకతుర్తి మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పిట్టల మహేందర్
భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి, సెప్టెంబర్.సహకార సంఘాలకు వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని, నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేయాలని సొసైటీ మాజీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 906 సహకార సంఘాలు ఉన్నాయని, ప్రస్తుతం అనేక సహకార సంఘాలు లాభాల బాటలో కొనసాగుతున్నాయని తెలిపారు.
సహకార సంఘాలు ప్రధానంగా రైతుల వాటాలు, మూలధనంతోనే కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పరికరాల కొనుగోలు, సిబ్బంది జీతాలు తదితర ఖర్చులను సహకార సంస్థలే భరిస్తున్నాయని అన్నారు. సహకార సంఘాల్లో ప్రభుత్వం పెట్టుబడి పెట్టకుండా, వాటి పాలకవర్గాల ఏర్పాటులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు.
సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతుల భాగస్వామ్యంతో నడిచే సహకార సంఘాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే బదులు నామినేటెడ్ విధానాన్ని తీసుకురావడం సరికాదని, ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి సంబంధిత జీవోను రద్దు చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు.
రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని శ్రీపతి రవీందర్ గౌడ్ స్పష్టం చేశారు. రైతుల హక్కులను, సహకార సంఘాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ సమావేశంలో ఎల్కతుర్తి మండల ప్రెసిడెంట్ బిఆర్ఎస్ పిట్టల మహేందర్ మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శేషగిరి, మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు గొల్లె మహేందర్, కడారి రాజు, ఎల్తూరి స్వామి, మదన్మోహన్, జూపాక జడ్సన్, అల్లకొండ రాజు, మండపోచయ్య, కోరే రాజ్‌కుమార్, గొల్లెపల్లి రవి, గొడిశాల వినయ్, బొంకురి కార్తీక్, ఉట్కూరి రాజు, పాటిభగవాన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.