BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:14 pm Posted by : Reporter Srikanth

ఎల్కతుర్తి సొసైటీ రైతులదే… ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల సొంత ఆస్తి కాదు

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి విశాల సహకార సంఘానికి ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు? నామినేటెడ్ పాలన ఎందుకు

ఎన్నికలు లేకుండానే చైర్మన్, డైరెక్టర్లను నియమించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా? అని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎల్కతుర్తి విశాల సహకార సంఘం రైతుల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన సంస్థ అని, అలాంటి సంస్థలో రైతులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం లేకుండా అధికార పార్టీకి చెందిన నాయకులను నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లుగా నియమించడం వెనుక ఉద్దేశం ఏమిటో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

సొసైటీలో సుమారు ₹3.20 కోట్ల మేర నిధులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో, ఆ నిధులు, సొసైటీ ఆస్తులు, రైతుల ప్రయోజనాలకు పూర్తి భద్రత ఉంటుందా? అనే ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు.

గతంలో సొసైటీకి సంబంధించిన అవకతవకలు, ఆర్థిక వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిగిందా? ప్రస్తుతం సొసైటీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? నిధులు, ఆస్తుల వివరాలను రైతులకు బహిరంగంగా వెల్లడిస్తారా? అని శ్రీకాంత్ యాదవ్ ప్రశ్నించారు.

ఎన్నికలను ఎదుర్కొని రైతుల తీర్పు పొందే ధైర్యం కాంగ్రెస్ నాయకులకు లేదా

ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే రైతులు ఎవరిని ఎన్నుకోవాలో వారే నిర్ణయిస్తారని, కానీ ఎన్నికలు లేకుండా నామినేషన్ల ద్వారా పదవులు కట్టబెట్టడం వల్ల సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.

సహకార సంఘాలు రైతుల కోసం ఉండాలి… అధికార పార్టీ నాయకులకు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు.

ఎల్కతుర్తి విశాల సహకార సంఘాన్ని ఇన్ని సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకున్న రైతులు, సభ్యుల ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ నియామకాలు చేయడం సరైన విధానం కాదన్నారు.

అధికారంలో ఉన్న వారు సొసైటీ నిధులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు అన్ని వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఎల్కతుర్తి సొసైటీ రైతులదే… ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల సొంత ఆస్తి కాదు.కాబట్టి వెంటనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి, రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం కల్పించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని శ్రీకాంత్ యాదవ్ తెలిపారు.