న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి: ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య
భీమ్ ఇండియా టుడే న్యూస్ హనుమకొండ జిల్లా:ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కింసారపు సంధ్య తీవ్రంగా ఖండించారు. ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అరెస్టు చేయడం బాధాకరమని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా కింసారపు సంధ్య మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి కోటీశ్వరులను చేస్తామని చెబుతూనే, తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళా ఆశా వర్కర్లను అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు.
ఆశా వర్కర్లకు నెలకు రూ.18 వేల జీతం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడిని తగ్గించి, ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అరెస్టు చేసిన ఆశా వర్కర్లను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, చర్చల ద్వారా పరిష్కారం చూపాలని కింసారపు సంధ్య విజ్ఞప్తి చేశారు.
అరెస్టయిన వారిలో కర్రే సరూప, సునంద, సునీత తదితర ఆశా వర్కర్లు ఉన్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు.