BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:50 pm Posted by : Reporter Srikanth

తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్రను గుర్తించాలి

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై దాడిని ఖండించిన హుజురాబాద్ మహిళలు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలు పోషించిన కీలక పాత్రను గుర్తు చేస్తూ హుజురాబాద్‌లో మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఉద్యమంలో ముందుండి పోరాడిన మహిళల త్యాగాలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మహిళలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించిందని వారు పేర్కొన్నారు.

హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు ఒకచోట చేరి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. మహిళలను గౌరవిస్తామని చెప్పే ప్రభుత్వం, మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డిపై పోలీసులతో దాడి చేయించడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా పోలీసుల చేత దాడులు చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళలు తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని, కేసులు, అరెస్టులు, పోలీసుల ఒత్తిళ్లకు భయపడకుండా తెలంగాణ కోసం పోరాడారని మహిళలు గుర్తుచేశారు. అలాంటి మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వారిపై దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

అధికారం శాశ్వతం కాదు.. కర్మ సిద్ధాంతం ఉంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తుపెట్టుకోవాలి” అంటూ మహిళలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు గతాన్ని మరిచిపోకూడదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు.

మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేత చర్యలను వెంటనే నిలిపివేయాలని, మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ గంధ రాధిక, సుశీల, రమాదేవి తదితర మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

తెలంగాణ కోసం పోరాడిన మహిళల గొంతును అణచివేయడం ఎవరి వల్లా సాధ్యం కాదు” అంటూ మహిళలు నినాదాలు చేస్తూ తమ నిరసనను కొనసాగించారు.