BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:32 pm Posted by : Reporter Srikanth

ప్రజల ఆవేదన, అధికారుల నిర్లక్ష్యం, గుట్టల ధ్వంసం–వన్యజీవుల ఆవాసాలపై ప్రభావం

దండేపల్లిలో కోతుల బెడద.. ప్రజల ప్రాణాలకు ముప్పు!

గుంపులుగా దాడులు.. చిన్నారులు, వృద్ధులు, రైతుల్లో భయాందోళన

గుట్టలు ధ్వంసం చేస్తే జంతువులు జనావాసాల్లోకి రావాల్సిందేనా?

అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తుల ఆగ్రహం

ఎల్కతుర్తి : బీమ్ ఇండియా టుడే  దండేపల్లి గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, ఇళ్ల పరిసర ప్రాంతాలతో పాటు పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలపై కోతుల గుంపులు దాడులకు పాల్పడుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఇంటి నుంచి బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది.

వరుస దాడులతో భయాందోళన.         

ఇటీవల దండేపల్లి గ్రామానికి చెందిన జాజాల రాములుపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే సీనియర్ గ్రామ వార్డు మెంబర్ గడ్డం రాజమౌళిపై వారం రోజుల క్రితం కోతుల గుంపు దాడి చేయడంతో గాయాలపాలై గోపాల్‌పూర్ పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు.                                                                                           ఈ ఘటనలతో గ్రామంలో ఆందోళన మరింత పెరిగింది. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. “మా పిల్లల ప్రాణాలకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది?” అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. గుట్టలు ధ్వంసమైతే జంతువులు ఎక్కడికి వెళ్లాలి? గ్రామాల పరిసరాల్లో ఉన్న చిన్నా, పెద్దా గుట్టలను విచ్చలవిడిగా ధ్వంసం చేయడం, సహజ వనరులను దెబ్బతీయడం వల్ల జంతువుల సహజ ఆవాసాలు కనుమరుగవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంతువులకు సహజ ఆవాసాలు, ఆహారం, నీటి వనరులు తగ్గిపోతే అవి జనావాసాల వైపు రావడం సహజమేనని వారు అంటున్నారు.

గుట్టలతో కోట్ల రూపాయల సంపాదన కోసం ప్రకృతిని నాశనం చేస్తూ పోతే.. చివరకు జంతువులు మనుషులపైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది” అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాసేవ ఎక్కడ? హామీలు మాత్రమేనా?     

ఎన్నికల సమయంలో ప్రజాసేవ కోసం తాము ఉన్నామని హామీలు ఇచ్చే నాయకులు, అధికారులు ప్రజల సమస్యలు ఎదురైనప్పుడు స్పందించడం లేదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. “మా ఓట్లు కావాలి.. మా బాధలు మాత్రం వద్దా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

కోతుల బెడదపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమస్యను ముందుగానే పరిష్కరించకుండా పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం వల్ల ప్రయోజనం ఏమిటని వారు నిలదీస్తున్నారు.                                 కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదుప్రకృతిని ధ్వంసం చేస్తూ, జంతువుల ఆవాసాలను నాశనం చేస్తే దాని ప్రభావం చివరకు మనుషులపైనే పడుతుందని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. “సృష్టిలో ఉన్న ప్రతి జీవికి బతికే హక్కు ఉంది. గుట్టలను నాశనం చేస్తూ పోతే జంతువులు జనావాసాల్లోకి రావాల్సిందే. కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 

పెద్దప్రమాదం.జరగకముందేచర్యలు.తీసుకోవలీ.  ఇప్పటికైనా గ్రామపంచాయతీ, అటవీశాఖ, సంబంధిత అధికారులు దండేపల్లి గ్రామంలో పర్యటించి కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజలకు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులకు రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అదే సమయంలో గ్రామాల చుట్టూ ఉన్న సహజ గుట్టలు, చెట్లు, జంతువుల ఆవాసాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. మరో ప్రాణం పోయేలోపు అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.