BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 12:21 am Posted by : Reporter Srikanth

నిరుపేద దళిత మహిళకు డబుల్ బెడ్‌రూం లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి

ప్రభుత్వానికి విన్నవించిన హుజురాబాద్ 16వ వార్డు మహిళ

భీమ్ ఇండియా టుడే న్యూస్ హుజురాబాద్, ఆగస్టు 31: తనకు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రభుత్వం తన పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని డబుల్ బెడ్‌రూం ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని హుజురాబాద్ పట్టణం 16వ వార్డుకు చెందిన కొండ శాంతమ్మ ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. తాను నిరుపేద దళిత మహిళనని, తనకు భర్త, పిల్లలు ఎవరూ లేరని వినతిపత్రంలో పేర్కొన్నారు. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్థోమత లేదని తెలిపారు.

తనకు సొంత ఇల్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, ప్రస్తుతం ఇతరులపై ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందని శాంతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల కోసం చేపడుతున్న గృహ నిర్మాణ పథకాల ద్వారా తనకు కూడా ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే తనకు స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లేదంటే అర్హత మేరకు డబుల్ బెడ్‌రూం ఇల్లు కేటాయించి తనకు సొంత గూడు కల్పించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.                                                                      తన సమస్యను గతంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి దరఖాస్తులు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం కాలేదని ఆమె పేర్కొన్నారు. నిరుపేద మహిళగా తన పరిస్థితిపై అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి, తనకు ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

నాకు సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్‌రూం లేదా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే జీవితాంతం రుణపడి ఉంటాను” అని శాంతమ్మ విజ్ఞప్తి చేశారు.