BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 31 August 2026, 11:40 pm Posted by : Reporter Srikanth

స్వస్థలాలకు మాజీ మావోయిస్టులు

గడ్చిరోలి నుంచి పయనమైన 53 మంది.. పునరావాసం అనంతరం సొంతూళ్లకు

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ గడ్చిరోలి: ఏళ్ల తరబడి మావోయిస్టు ఉద్యమంలో కొనసాగి, అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టులు పునరావాస ప్రక్రియ పూర్తిచేసుకుని స్వస్థలాలకు పయనమయ్యారు. గడ్చిరోలి జిల్లా పరిధిలోని పునరావాస శిబిరాల్లో ఉన్న 53 మంది మాజీ మావోయిస్టులు తమ కుటుంబ సభ్యుల వద్దకు తిరిగి వెళ్లేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, బస్తర్, సుక్మా వంటి ప్రాంతాలకు చెందిన పలువురు గతంలో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ పునరావాస విధానంపై నమ్మకంతో పోలీసుల ఎదుట లొంగిపోయి సాధారణ జీవనంలోకి వచ్చారు. వారికి ప్రభుత్వం, పోలీసు శాఖ తరఫున పునరావాసం కల్పించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన సహకారం అందించినట్లు పేర్కొన్నారు.

గడ్చిరోలి శిబిరంలో ఉన్న 53 మంది మహిళలు, పురుషులు తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు స్వస్థలాలకు బయలుదేరారు. వీరిలో బీజాపూర్ జిల్లాకు చెందిన వారు 33 మంది ఉండగా, సుక్మాకు చెందిన వారు 11 మంది, కాంకేర్, దంతేవాడ, మొహల్లా మాన్‌పూర్ తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం.

మరోవైపు గడ్చిరోలి ఆర్కేపీఎఫ్‌ పోలీస్ బ్యారక్‌లో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాజీ మావోయిస్టులకు అధికారులు ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. పునరావాసం ద్వారా సాధారణ జీవితంలోకి వచ్చిన వారికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు.

సొంత ప్రాంతాలకు చేరుకున్న మాజీ మావోయిస్టులు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది. చాలా కాలం తర్వాత తమ వారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు మాజీ మావోయిస్టులు తెలిపారు. ప్రభుత్వం కల్పించిన పునరావాస అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇకపై సాధారణ జీవితం కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.మాజీ మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి ప్రజా జీవనంలోకి రావడం ద్వారా శాంతి, అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.