BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 5:51 pm Posted by : Reporter Srikanth

మన పంట – మన గ్రామం – మనకు మనమే మార్కెట్

  1. దామెరలో తొలిసారిగా రైతు మార్కెట్ ఏర్పాటు

మన పంట – మన గ్రామం – మనకు మనమే మార్కెట్

భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి  .దామెర: గ్రామీణ రైతులకు తమ పంటకు స్థానికంగానే మంచి మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో దామెర గ్రామంలో మొట్టమొదటిసారిగా రైతు మార్కెట్ (కూరగాయల మార్కెట్) ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామ రైతులకు ఎంతో ఉపయోగకరమైన ముందడుగుగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రతి ఆదివారం జరిగే ఈ మార్కెట్ కేవలం వారం సంతగా మాత్రమే కాకుండా, దామెర గ్రామంలో కూరగాయలు పండించే రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించాల్సిన అవసరం లేకుండా, తమ గ్రామంలోనే నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే వేదికగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మన పంట – మన గ్రామం – మనకు మనమే” అనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతు పండించిన పంటకు మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి, రైతుకు మెరుగైన ధర లభించేలా చేయడంతో పాటు, గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రైతులు తమ పంటను స్వయంగా విక్రయించుకోవడం, గ్రామ ప్రజలు నేరుగా రైతుల వద్ద నుంచే కూరగాయలు కొనుగోలు చేయడం ద్వారా రైతు–వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు, సమయం ఆదా కావడంతో పాటు, స్థానికంగా రైతులకు ఆదాయ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

దామెరలో పండే కూరగాయలకు దామెరలోనే మార్కెట్ కల్పించడం ద్వారా స్థానిక రైతులను ప్రోత్సహించడంతో పాటు, గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ రైతు మార్కెట్‌ను భవిష్యత్తులో మరింత విస్తరించి, దామెరలోని ఎక్కువ మంది రైతులు తమ పంటలను నేరుగా విక్రయించుకునేలా ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంకాని పద్మ, ఉపసర్పంచ్ మద్దే కుమార్, బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యులు, సాకూరి కుమార్ అంబేద్కర్ రిస్ట్ మరియు గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.