భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త తెలిపింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం 5 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆగస్టు 27 నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి మరో 240 బస్సులను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు అందిస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయంలో ఎలాంటి మార్పు ఉండదని, మహాలక్ష్మి పథకం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాగా, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా అదనపు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆగష్టు 26న మిలాద్-ఉన్-నబీ, ఆగష్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగష్టు 30 ఆదివారం వరుస సెలవుల కారణంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఆగష్టు 30 ఆదివారం మధ్యాహ్నం నుండి ఆగష్టు 31 సోమవారం వరకు తిరుగు ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించేలా టీజీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.