BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 6:55 pm Posted by : Reporter Srikanth

ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ

భీమ్ ఇండియా టుడే న్యూస్.ఎల్కతుర్తి సొంత నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి.. ప్రజల గోడు పట్టించుకోరా? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ప్రజల ఆగ్రహం – అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన కరువు

ఎల్కతుర్తి మండలం:ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీస రహదారి సౌకర్యాలు కూడా సక్రమంగా అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్కతుర్తి మండలంలోని సిద్దిపేట హైవేను ఆనుకుని, ఎస్బీఐ బ్యాంక్ పక్కనుంచి దామెర గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డుపై గుంతలు ఏర్పడి, ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. వర్షాలు పడిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ రహదారి దుస్థితిపై గ్రామ ప్రజలు పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సమస్యను అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో “ప్రజల సమస్యలు పరిష్కరించేది ఎవరు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గ పరిధిలోనే రహదారుల పరిస్థితి ఇలా ఉండటంపై ప్రజలు నిలదీస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెబుతున్నప్పటికీ, గ్రామాలను కలిపే కీలక రహదారులు అధ్వానంగా ఉండటం ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోందని స్థానికులు అంటున్నారు.

ప్రజా పాలన అంటే కేవలం హామీలు, ప్రకటనలు కాదు.. ప్రజలు నిత్యం ప్రయాణించే రోడ్లను బాగు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యతే” అని గ్రామస్థులు పేర్కొంటున్నారు.

దామెర గ్రామానికి వెళ్లే రహదారిని వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రజల గోడు వినిపించకపోతే.. ప్రజా పాలన ఎక్కడ? అనే ప్రశ్న ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.