భీమ్ ఇండియా టుడే న్యూస్ ఎల్కతుర్తి లో కారులో యువతి మృతదేహం.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో యువతి మృతదేహం లభ్యమైన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రెస్‌నోట్ ప్రకారం.. ఆగస్టు 21న ఎల్కతుర్తి గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ సమీపంలోని గల్లీలో ఓ కారులో నుంచి దుర్వాసన వస్తోందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కారు డిక్కీలో సుమారు 25 నుంచి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, వరంగల్ పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీ ఆదేశాల మేరకు, కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
ఈ క్రమంలో ఆగస్టు 23న ఎల్కతుర్తి గ్రామ శివారులోని నాగార్జున సీడ్స్ ప్లాంట్ వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని పేరు ఏడెల్లి వినోద్ కుమార్ (34), ప్రైవేట్ ఉద్యోగి, ఎల్కతుర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతురాలు మానస గోదావరిఖనికి చెందిన యువతి. వినోద్ కుమార్‌కు ఆమె చిన్ననాటి స్నేహితురాలని, గతంలో ఆమెకు రెండు వివాహాలు జరిగి విడాకులు కూడా అయినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 16న అరుణాచలం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మానస, అనంతరం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి వినోద్ కుమార్‌తో కలిసి కరీంనగర్‌లో ఉన్నట్లు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆగస్టు 18న కరీంనగర్‌లోని వినోద్ కుమార్ గదిలో మానస తనను వివాహం చేసుకోవాలని కోరగా, ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మానసను వినోద్ కుమార్ గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించాడని పోలీసులు పేర్కొన్నారు.
అనంతరం మృతదేహాన్ని కారులో తరలించి ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ చెక్‌పోస్ట్ సమీపంలోని గల్లీలో కారును నిలిపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.
నిందితుడు ఏడెల్లి వినోద్ కుమార్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది
.నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎల్కతుర్తి సీఐ పులి రమేష్, ఎస్‌ఐ నరసింహరావు, హెచ్‌సీ విఠల్‌రావు, పీసీలు భాస్కర్‌రెడ్డి, అఖిల్, బక్కయ్య, సుమన్, నిరంజన్ తదితర పోలీసు సిబ్బందిని ఏసీపీ కాజీపేట ప్రశాంత్ రెడ్డి అభినందించినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు.