భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ తెలంగాణ హైకోర్టులో ఘనంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ జన్మదిన వేడుకలు
న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడటమే ధ్యేయం:
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్
మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పి.వి. నరసింహరావు వారసత్వం, ఆశయాలే నాకు మార్గదర్శకం
తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) గౌరవ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ ఎన్. వి. శ్రవణ్ కుమార్ జన్మదిన వేడుకలు సోమవారం హైకోర్టు ప్రాంగణంలో అత్యంత వైభవంగా,కోలాహలంగా, పండుగ వాతావరణంలో జరిగాయి. భారతదేశ దిగ్గజ నాయకుడు, మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ
శ్రీ పి.వి. నరసింహరావు మనవడైన జస్టిస్ శ్రవణ్ కుమార్.. తన తాత స్ఫూర్తితో న్యాయరంగానికి విశిష్ట సేవలందిస్తూ, సమర్థవంతమైన, నిష్పాక్షికమైన తీర్పులతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ శుభసందర్భంగా హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (ఏజీపీ)
ఈ. రవీందర్ రెడ్డి నేతృత్వంలో ప్రముఖ న్యాయవాదులు శ్రీ బోయిని ఆనంద్, శ్రీ గుడి మధుసూదన్ రెడ్డి, శ్రీ చట్ల మణికుమార్ తదితర న్యాయకోవిదులు జస్టిస్ శ్రవణ్ కుమార్ ని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడుతూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంలో ఆయన చూపుతున్న శ్రద్ధ, నిరంతర కృషి వర్ధమాన న్యాయవాదులకు ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా పలువురు సీనియర్ న్యాయవాదులు కొనియాడారు.ఆయనకు భగవంతుడు పరిపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తనకు శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు అభిమానులను ఉద్దేశించి గౌరవ న్యాయమూర్తి మాట్లాడుతూ
“నన్ను ఆశీర్వదించి, ఇంతటి ప్రేమాభిమానాలను అందించిన తోటి న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి, సమాజానికి బలమైన పునాది. మా తాత, మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పి.వి. నరసింహరావు నాకు నేర్పిన విలువలు, క్రమశిక్షణ, దేశభక్తే నన్ను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ప్రజాసేవ, రాజ్యాంగ పరిరక్షణనే ఆయన తన శ్వాసగా భావించేవారు.అదే మార్గంలో నడుస్తూ, రాజ్యాంగం పట్ల పూర్తి నిష్ఠతో పనిచేయడమే నేను ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.సామాన్య మానవుడికి న్యాయం త్వరితగతిన, పారదర్శకంగా అందడమే మన న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యం.బాధితులకు కాలయాపన లేకుండా న్యాయఫలాలు అందించడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమైనది. సీనియర్ న్యాయవాదులతో పాటు యువ న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకుని, నిరంతరం అధ్యయనం చేస్తూ బాధితులకు అండగా నిలవాలి.నా ఈ న్యాయసేవా ప్రయాణంలో మీరందరూ చూపిస్తున్న ఈ గౌరవం, ఆప్యాయత నాపై బాధ్యతను మరింత పెంచాయి. సమాజానికి, ప్రజా సంక్షేమానికి నా శక్తివంచన లేకుండా సేవ చేయడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు.
ఈ వేడుకల్లో పలువురు హైకోర్టు సీనియర్,జూనియర్ న్యాయవాదులు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు, కోర్టు అధికారులు, సిబ్బంది అభిమానులు పాల్గొని జస్టిస్ శ్రవణ్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.