భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి హైదరాబాద్–అమరావతి–బందరు పోర్టుకు 12 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే
298 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు ప్రాథమిక ప్రతిపాదన*.
పక్కపక్కనే 760 కి.మీ. హైస్పీడ్ రైల్ కారిడార్
ఫ్యూచర్ సిటీ–అమరావతి–మచిలీపట్నం మీదుగా రైలు మార్గం
ఒకేసారి భూసేకరణకు ప్రతిపాదన.. తగ్గనున్న ప్రయాణ, రవాణా సమయం. హైదరాబాద్–ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త రవాణా కారిడార్‌కు రూపకల్పన
హైదరాబాద్–అమరావతి–మచిలీపట్నం మధ్య భారీ రవాణా కారిడార్‌కు ప్రాథమిక ప్రతిపాదన సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని తిప్పారెడ్డిపల్లి/ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం బందరు పోర్టు వరకు సుమారు 298 కిలోమీటర్ల పొడవున 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాన్ని ప్రాథమికంగా ప్రతిపాదించారు.
ఇదే అలైన్‌మెంట్‌కు సమాంతరంగా శంషాబాద్–ఫ్యూచర్ సిటీ–అమరావతి–మచిలీపట్నం మీదుగా సుమారు 760 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.2.24 లక్షల కోట్ల అంచనా వ్యయంగా పేర్కొంటున్నారు.
ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో జాతీయ రహదారికి ఎడమవైపు ఎక్స్‌ప్రెస్‌వే, కుడివైపు హైస్పీడ్ రైలు మార్గం ఉండేలా రూపకల్పన చేయనున్నారు. రెండు ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఒకేసారి సేకరించడం ద్వారా భవిష్యత్‌లో భూసేకరణ సమస్యలను తగ్గించడంతో పాటు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నది ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్–ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణ సమయం, సరుకు రవాణా సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతితో పాటు మచిలీపట్నం బందరు పోర్టుకు వేగవంతమైన రహదారి, రైలు కనెక్టివిటీ ఏర్పడటం ద్వారా పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించే అవకాశం ఉంది.హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టు వరకు రోడ్డు–రైలు మార్గాలను సమాంతరంగా అభివృద్ధి చేసే ఈ ప్రతిపాదన అమలైతే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మౌలిక వసతుల్లో కీలక మార్పుకు దారి తీయనుంది.