భీమ్ ఇండియా టుడే న్యూస్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం,భూ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో చల్లగరిగ రెవెన్యూ గ్రామ పరిధిలోని గ్రామాలు, తిరుమలాపూర్ పరిధిలోని గ్రామాలు, అలాగే చిట్యాల హెడ్‌క్వార్టర్ రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన గ్రామసభలు గురువారం చల్లగరిగ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో, చిట్యాల రైతు వేదికలో నిర్వహించారు.
ఈ గ్రామసభలకు భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ *గండ్ర సత్యనారాయణ రావు* ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రెవెన్యూ భూ సర్వే ద్వారా గ్రామాల్లోని రైతుల భూముల సరిహద్దులతో పాటు గ్రామ సరిహద్దులను కూడా స్పష్టంగా గుర్తించి, పట్టా భూములు, ప్రభుత్వ రెవెన్యూ భూములు, అటవీ భూములను శాస్త్రీయంగా కొలతలు వేసి హద్దులు నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. భూ వివరాలు స్పష్టంగా నమోదు చేసి ప్రతి అర్హత కలిగిన రైతుకు పట్టాదారు పాస్‌బుక్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.పట్టాదారు పాస్‌బుక్ ద్వారా రైతులకు రైతుబంధు, రైతుబీమా, పంట రుణాలు పొందడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, ఇతర కొనుగోలు మరియు పండించిన పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సులభంగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే వివరించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ సర్వే ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, సమన్వయంతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, అధికారులు పరస్పరం సహకరించి సర్వే విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏ.డి. సర్వే అధికారి, ఎంపీడీవో, తహసీల్దార్, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.