భీమ్ ఇండియా టుడే ఆంధ్రప్రదేశ్ 11-08-26.గత మూడేళ్లలో 21,286 కోట్ల విలువైన వర్జీనియా పొగాకు ఎగుమతి.. ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
పొగాకు ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా భారత్. అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ధరల్లో హెచ్చుతగ్గులు.
ఏలూరు ఎంపీతో కేంద్ర వాణిజ్య మంత్రి. ఢిల్లీ/ఏలూరు, ఆగస్టు 11: గత మూడేళ్లలో దేశం నుంచి 21,286 కోట్ల విలువైన 4,45,321 మెట్రిక్ టన్నుల వర్జీనియా పొగాకు ఎగుమతులు జరిగినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా (FCV) పొగాకు ధరలు, ఎగుమతులపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంగళవారం లోక్‌సభలో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. FCV పొగాకు ఎగుమతులు పరిమాణం పరంగా 8.19% , విలువ పరంగా 31.20% పెరిగాయని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో, 2025-26 పంట కాలానికి, ప్రస్తుతం వేలంపాటలు జరుగుతున్నాయని చెప్పిన కేంద్ర మంత్రి, పొగాకు బోర్డు నిర్వహించే పారదర్శక ఎలక్ట్రానిక్ వేలం ద్వారా ధరల నిర్ధారణ జరుగుతుందన్నారు. అయితే ఈ ధరల హెచ్చుతగ్గులు అనేవి అంతర్జాతీయ డిమాండ్, సరఫరాల ఆధారంగా నిర్ణయించబడతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గత మూడేళ్లలో పంట పరిమాణం 2023-24 పంట సంవత్సరంలో 181.02 మిలియన్ కేజీలు ఉండగా, 2025-26 నాటికి 240.64 మిలియన్ కేజీలకు పెరగటంతోబాటు, సగటు ధర కిలోకు రూ.225 నుండి రూ. 288.65కు పెరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నప్పటికీ, భారతదేశం FCV పొగాకును ఎగుమతి చేసే అగ్రగామి దేశాలలో ఒకటిగా కొనసాగుతోందని, 127కు పైగా దేశాలకు పొగాకు ఎగుమతులు చేస్తూ, పరిమాణం పరంగా పొగాకు ఉత్పత్తి, ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేశంగా ఉందన్నారు. గత పదేళ్లలో భారతదేశం నుంచి వర్జీనియా పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల ఎగుమతులు మొత్తంగా రూ. 6,450.66 కోట్ల (240.93 మిలియన్ కిలోలు) నుండి రూ. 17,192.04 కోట్ల (368.85 మిలియన్ కిలోలు)కు పెరగగా, పరిమాణం పరంగా 53.10%, విలువ పరంగా 166.51% పెరుగుదల నమోదైనట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఇచ్చిన సమాధానంలో కేంద్ర మంత్రి వెల్లడించారు.