BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 1:15 am Posted by : Reporter Srikanth

రేవంత్ రెడ్డి  విస్తృతంగా చర్చలు జరిపారు. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో      భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించడం, పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి  విస్తృతంగా చర్చలు జరిపారు. 

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ గారితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై చర్చ జరిగింది.

 ముఖ్యంగా జీఎస్టీ, ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై అరవింద్‌ సుబ్రమణియన్ గారితో చర్చించారు. జీఎస్టీ అధికారులకు ప్రత్యేక ఏఐ ఆధారిత సమాచారంతో మరింత సులభతరం చేసే వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు స్పష్టం చేశారు. 

ఈ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ఉండాలని సూచించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూనే సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ను మెరుగు పరిచేలా టెక్నాలజీ వాడకం ఉండాలని సుబ్రమణియన్ గారు వివరించారు.

 పన్నుల లీకేజీలను అరికట్టడంలో శాఖల మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దాలని ముఖ్యమంత్రి  చెప్పారు. ప్రధానంగా భవన, నిర్మాణ సామగ్రి విషయంలో లీకేజీలను అరికట్టడానికి మున్సిపల్, రెరా, పంచాయతీ రాజ్, విద్యుత్, ఆర్ధిక, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ఏఐ సాయంతో ఏర్పాటు చేసే వ్యవస్థ ద్వారా సమన్వయం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

 భారీ భవనాలు, కాంట్రాక్టు పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాలు వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ డేటాతో పాటు మీసేవా, ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. 

 ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, ఎక్సైజ్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్ గారితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.