BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 11:35 am Posted by : Reporter Srikanth

అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు

అదనపు ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవుప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు టీజీఏఎఫ్‌ఆర్సీ హెచ్చరిక

భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రభుత్వం, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) నిర్ణయించిన ట్యూషన్ ఫీజులకు మించి విద్యార్థుల నుంచి ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయరాదని కమిటీ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇటీవల అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ట్యూషన్ ఫీజుతో పాటు డెవలప్‌మెంట్ ఫీజు, బిల్డింగ్ ఫండ్, ల్యాబ్ ఫీజు, స్పెషల్ ఫీజు, మెయింటెనెన్స్ ఫీజు తదితర పేర్లతో అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నట్లు కమిటీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో టీజీఏఎఫ్‌ఆర్సీ స్పందించి, అనుమతించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

నిర్ణయించిన ఫీజులకు మించి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని కళాశాలల యాజమాన్యాలకు సూచించింది. అదనపు వసూళ్లకు పాల్పడినట్లు ఆధారాలతో ఫిర్యాదులు అందితే సంబంధిత కళాశాలలపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన రెండు ఇంజినీరింగ్ కళాశాలలపై విచారణ జరిపి, ఒక్కో కళాశాలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు కమిటీ వెల్లడించింది. అవసరమైతే భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది.

ప్రవేశాల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారికంగా ప్రకటించిన ఫీజుల వివరాలను పరిశీలించి మాత్రమే చెల్లింపులు చేయాలని కమిటీ సూచించింది. అదనపు ఫీజులు డిమాండ్ చేస్తే వెంటనే టీజీఏఎఫ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయాలని కోరింది. ఫిర్యాదులను గోప్యంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ముఖ్యాంశాలు…

ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు టీజీఏఎఫ్‌ఆర్సీ హెచ్చరిక.

నిర్ణయించిన ట్యూషన్ ఫీజులకు మించి అదనపు ఫీజులు వసూలు చేయరాదు. డెవలప్‌మెంట్, ల్యాబ్, బిల్డింగ్ ఫండ్ తదితర పేర్లతో వసూళ్లు నిషేధం.

నిబంధనలు ఉల్లంఘించిన రెండు కళాశాలలకు రూ.2 లక్షల చొప్పున జరిమానా. అదనపు వసూళ్లు జరిగితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయాలని సూచన.