BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:31 am Posted by : Reporter Srikanth

కమీషన్‌కు ఆశపడి.. ఖజానా దోపిడీ

 

అధికారులకు గుత్తేదారుల ఝలక్‌
78 మంది లైసెన్సులను నిలిపేసిన జీహెచ్‌ఎంసీ
భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ 

ఒకే పనికి రెండుసార్లు బిల్లులు చెల్లించిన అధికారులకు.. గుత్తేదారులు ఝలక్‌ ఇస్తున్నారు. అవినీతి వెలుగులోకి రావడంతో.. అడ్డదారిలో వెళ్లిన నిధులను రికవరీ చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అయితే.. రెండో బిల్లుకు 10 శాతం కమీషన్‌ తీసుకున్న అధికారులూ.. ఆ డబ్బును తిరిగివ్వాలని కాంట్రాక్టర్లు పట్టుబడుతున్నారు. అలాగే.. అధికారులు అడుగుతున్న వడ్డీ డబ్బును చెల్లించలేమంటున్నారు.

బల్దియా చరిత్రలో తొలిసారి..

కమీషన్, వడ్డీ డబ్బుతో గుత్తేదారులు రికవరీ ప్రక్రియపై మెలిక పెట్టడంతో.. శాఖాపరమైన చర్యల పేరుతో ఫైనాన్స్‌ విభాగం 78 మంది లైసెన్సులను నిలుపుదల చేసింది. ఆయా గుత్తేదారులకు ఇకపై జీహెచ్‌ఎంసీ ద్వారా బిల్లుల చెల్లింపు జరగకుండా చర్యలు తీసుకుంది. బల్దియా చరిత్రలో ఇంత మంది కాంట్రాక్టర్లపై ఒకేసారి చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.

కమిషనర్‌ లేఖలతో..

అనారోగ్యం, బిడ్డల వివాహం, ఇతరత్రా అత్యవసర కారణాలు చూపుతూ.. తమకు వెంటనే బిల్లులు చెల్లించాలని అభ్యర్థిస్తూ కొందరు కాంట్రాక్టర్లు బల్దియా కమిషనర్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటారు. కొన్నింటిని కమిషనర్‌ పరిగణనలోకి తీసుకుంటారు. ఆయా గుత్తేదారులకే రెండు సార్లు బిల్లుల చెల్లింపు జరిగింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ చేతివాటమే అందుకు కారణంగా తెలుస్తోంది. ఏళ్లుగా ఫైనాన్స్‌ విభాగంలో పనిచేస్తోన్న ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది.. కమిషనర్‌ సిఫార్సును సొమ్ము చేసుకున్నాడు. కమిషనర్‌ సిఫార్సు లేఖతో గుత్తేదారు బిల్లును చెల్లింపునకు పంపించి, ఆయా కాంట్రాక్టర్ల బిల్లులను వరుస క్రమంలోనూ కొనసాగించారు. ఫైనాన్స్‌ విభాగం సలహాదారు, అదనపు కమిషనర్, కమిషనర్‌ కూడా.. రెండు బిల్లులను గుడ్డిగా ఆమోదించారు. దాంతో.. ఒక్కో కాంట్రాక్టరుకు రెండుసార్లు డబ్బు వెళ్లింది.

అంతా అతనే ‘ఆపరేట్‌’ చేశాడు..

ఖాతాలో రెండోసారి బిల్లు జమ కాగానే కొందరు గుత్తేదారులు ఫైనాన్స్‌ విభాగానికి సమాచారం ఇచ్చారు. కానీ.. పది శాతం కమీషన్‌ తీసుకున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌.. మీకేం కాదంటూ తిప్పి పంపాడు. అధికారులకు సైతం కమీషన్‌లో వాటా ఇచ్చాడు. న్యాయపరమైన చిక్కులొస్తాయని కొందరు ఏడాది కిందటే బ్యాంకులో డబ్బు తిరిగి జమ చేయగా.. సుమారు వంద మంది గుత్తేదారులు ఆపరేటర్‌ మాట విని మౌనంగా ఉండిపోయారు. ఇటీవల ఐటీ విభాగం అదనపు కమిషనర్‌ రాధికాగుప్తా.. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఇప్పటి వరకు చెల్లించిన బిల్లులను సరిచూడటంతో డొంక కదిలింది. కంగుతిన్న ఫైనాన్స్‌ విభాగం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వడ్డీతో సహా డబ్బును తిరిగి చెలించాలని కాంట్రాక్టర్లకు సూచించగా.. కొందరు సమ్మతి తెలిపారు. మరికొందరు.. తాము ఇచ్చిన కమీషన్‌ డబ్బును తిరిగివ్వాలని అధికారులను డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం