BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 8:57 am Posted by : Reporter Srikanth

ఇంటి నుంచే తపాలా బీమా చెల్లింపులు

 

               డిజిటల్‌ సేవల్లో మరో ముందడుగు

 

భీమ్ ఇండియా టుడే డిజిటల్ హైదరాబాద్ : మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ సేవలను వేగంగా ఆధునికీకరిస్తోంది. గతంలో పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ), రూరల్‌ పోస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) ప్రీమియం చెల్లించాలంటే వినియోగదారులు కచ్చితంగా పోస్టాఫీసుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా, పాలసీదారులు తమ ప్రీమియాన్ని నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా చెల్లించేలా డిజిటల్‌ సేవలను అందుబాటులోకి ఉంచింది. దీంతో వినియోగదారుల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పారదర్శకత కూడా పెరిగింది.

డిజిటల్‌ సదుపాయాలు..

  • నెట్‌ బ్యాంకింగ్‌: ప్రముఖ బ్యాంకుల నెట్‌ బ్యాంకింగ్‌ సేవలతో ప్రీమియం చెల్లించవచ్చు.
  • డెబిట్, క్రెడిట్‌ కార్డులు: మాస్టర్, వీసా లేదా రూపే కార్డుల ద్వారా లావాదేవీలు జరపవచ్చు.
  • యూపీఐ చెల్లింపులు: ఎలాంటి అదనపు రుసుము లేకుండా వేగంగా యూపీఐ ఐడీ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా డబ్బులు కట్టొచ్చు.
  • ఐపీపీబీ మొబైల్‌ యాప్‌: ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) యాప్‌ ద్వారా కూడా నేరుగా పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ ఖాతాలను లింక్‌ చేసి క్షణాల్లో ప్రీమియం జమ చేయొచ్చు.
  • ఆటో డెబిట్‌ సదుపాయం: వినియోగదారులు తమ ఖాతా నుంచి నిర్ణీత తేదీలో ప్రీమియం కట్‌ అయ్యేలా ఆటో డెబిట్‌ సౌకర్యం కూడా ఉంది.

ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలంటే..

1. ఇండియా పోస్ట్‌ అధికారిక పీఎల్‌ఐ పోర్టల్‌ pli.indiapost.gov.in లోకి వెళ్లి, పాలసీ నంబర్, ఈ-మెయిల్, ఫోన్‌ నంబర్, వ్యక్తిగత వివరాలతో కస్టమర్‌ ఐడీని క్రియేట్‌ చేసుకుని లాగిన్‌ అవ్వాలి.

2. పీఎల్‌ఐ లేదా ఆర్‌పీఎల్‌ఐ పాలసీలను కస్టమర్‌ ఐడీకి లింక్‌ చేయాలి.

3. లాగిన్‌ అయ్యాక ‘పేమెంట్స్‌ లేదా పర్చేజ్‌’ సెక్షన్‌కు వెళ్లి పాలసీ ఎంచుకుని ప్రీమియం సరిచూసుకోవాలి.

4. నచ్చిన రుసుము విధానంతో చెల్లించాలి.

5. ఈ-రసీదును వెంటనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రయోజనాలు ఇలా..

  • పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం, క్యూ లైన్లలో నిల్చోవాల్సిన బాధ తప్పుతుంది.
  • 24/7 ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో ఉన్నా లేదా ఆఫీస్‌ పనిలో ఉన్నా ప్రీమియం గడువు ముగియకుండా చెల్లించవచ్చు.
  • ప్రీమియం చెల్లించగానే రిజిస్టర్డ్‌ చరవాణి నంబర్‌కు మెసేజ్‌ వస్తుంది.
  • కేవలం చెల్లింపులే కాకుండా పాలసీ బోనస్‌ ఎంత వచ్చింది, లోన్‌ సదుపాయం ఎంత ఉంది వంటి వివరాలను కూడా కస్టమర్‌ పోర్టల్‌లో చూసుకోవచ్చు.