భీమ్ ఇండియా టుడే అదిలాబాద్ నేర విభాగం : విరిగిన నంబరు ప్లేట్ ఆధారంగా పోలీసులు కూపీ లాగితే కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయిన ఘటన ఇది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి ముఠాలోని పది మందిని అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 21న ముఠా సభ్యులు రిమ్స్‌లో ఆటో చోరీకి యత్నించారు. వారిని పట్టుకోవటానికి ప్రత్యేకంగా 24న కుప్టి ఘాట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అయిదుగురితో వెళ్తున్న కారును ఆపారు. అందులో నుంచి ఇద్దరు దిగి కత్తులతో చంపుతామని బెదిరిస్తూ.. హెచ్చరించి పరారయ్యారు. ఆ కారుకు విరిగిన నంబరు ప్లేటు ఉండటాన్ని గమనించిన పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేపట్టారు. అనంతరం 25న వాంకిడి చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీలు చేస్తూ అదే కారును గుర్తించి అందులోని అయిదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా నిర్మల్ పట్టణానికి చెందిన ప్రధాన నిందితులు యాసర్, మొహ్మద్ అద్నాన్ అహ్మద్ అలియాస్ సోహెల్ వాహన డ్రైవర్లుగా పనిచేస్తూ ఒక కారును అద్దెకు తీసుకొని వాహనాల చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దొంగిలించిన వాహనాలను ముఠా సభ్యులైన ఇఫ్తెకార్, అబూతలాహ వద్ద ఉంచి విక్రయిస్తున్నారు.
లోతుగా విచారణ..
నిందితులపై అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా.. వీరు ముఠా 16 మందితో కలిసి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.17 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు, ఎనిమిది చరవాణులు, ఒక కత్తి, ఒక కారు, రూ.1,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్‌కు చెందిన యాసర్ అహ్మద్ (రాంనగర్), అక్బర్‌ఖాన్(సోఫినగర్), ఉమర్‌ఖాన్ (సోఫినగర్), అబ్దుల్ పారిక్ (గల్జార్ మార్కెట్), అర్ఫత్‌ఖాన్ (బుధవార్‌పేట్), మొహ్మద్ అద్నాన్ అహ్మద్ ఎలియాస్ సోహెల్ (బాగులవాడ), నాసర్ బిన్ జావిద్ (ఆదర్శనగర్), ఆజమ్‌ఖాన్ (సోఫినగర్), షేక్ ఇఫ్తెఖార్ (మదీనా కాలనీ), షేక్ అబూతలాహ (ఆదర్శనగర్)లను ఆదివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పరారీలో ఉన్న ఈ ముఠాలోని నిర్మల్‌కు చెందిన ఇమ్రాన్, జునైద్ (ఆదర్శనగర్), సోఫియాన్(బుధవార్‌పేట్), పర్దీన్, అద్‌నాన్, జైన్(నిజామాబాద్) కోసం గాలిస్తున్నామన్నారు. దొంగల ముఠా గుట్టురట్టు చేసిన ఇచ్చోడ సీఐ సీహెచ్ రమేశ్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్‌లకు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు