BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 12:28 am Posted by : Reporter Srikanth

మృత్యువులోనూ వీడని స్నేహం

       రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

భీమ్ ఇండియా టుడే న్యూస్ పాలకుర్తి:కలిసి పెరిగారు.. కలిసి తిరిగారు.. కష్టాసుఖాల్లో ఒకరికొకరు తోడై, నీడై నిలిచారు. అన్నదముల్లా మెలిగారు.. వారి స్నేహం చూసి విధి అసూయపడినట్లుంది. వారికి మృత్యువునిచ్చి.. తన దగ్గరకు తీసుకుపోయింది. ఈ విషాద సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం నర్సింగపురం తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాదావత్‌ తిరుపతి(34), కేతావత్‌ నరేందర్‌(27) ప్రాణమిత్రులు. తిరుపతి తల్లి సుగుణమ్మ పాలకుర్తిలోని ఓ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉండగా చూసేందుకు వీరిద్దరూ గురువారం వెళ్లారు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వస్తున్నారు. నరేందర్‌ వాహనం నడుపుతుండగా, తిరుపతి వెనుక కూర్చున్నారు. చీకటిగా ఉండడంతో.. బమ్మెర శివారులోని ఘన్‌పూర్‌-పాలకుర్తి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీ కనిపించలేదు. ద్విచక్ర వాహనం నేరుగా లారీ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు తిరుపతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన నరేందర్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన కూడా మృతి చెందాడు. వారి మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు చేసిన రోదనలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించాయి. ప్రమాదానికి రహదారి పక్కనే నిర్లక్ష్యంగా బోరు లారీ నిలిపివేయటమే కారణమని ఆరోపించిన తండావాసులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పోలీసు స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. గంటపాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధిత కుటుంబాలకు తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమమించారు.