BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 12:11 am Posted by : Reporter Srikanth

నిబంధనలకు సమాధి.. నిర్మాణాలకు పునాది

పరకాలలో మురుగుకాల్వను ఆనుకొని నిర్మిస్తున్న ఇళ్ళు

భీమ్ ఇండియా టుడే పరకాల:హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో అక్రమ ఇళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు నిబంధనలను విస్మరించారు. సెట్‌బ్యాక్‌ లేకుండానే ఇళ్లు, భవనాల నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో పురపాలక సంఘం ఆదాయానికి గండి పడుతోంది. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. పట్టణంలో 22 వార్డులుండగా రాజిపేట, సీతారాంపురం విలీన గ్రామాలున్నాయి. 9,175 ఇళ్లు అధికారికంగా ఉండగా, ఇంటి నంబర్లు లేని గృహాలు సుమారు 300 వరకు ఉన్నాయి.

అనుమతులు లేకుండానే.. : పురపాలికలో విలీనమైన రాజిపేట, సీతారాంపురం గ్రామాల్లో వ్యవసాయ, వారసత్వ భూములే అధికంగా ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో కలిసిపోయినా కొందరు వ్యవసాయేతర భూములుగా మార్చుకుంటున్నారు. మరి కొందరు ఎలాంటి భూమి పత్రాలు లేకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. వీటితో పాటు పట్టణంలో చాలా మంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం.. మున్సిపాల్టీ నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకొని రోడ్డు పక్కన 5 అడుగుల స్థలాన్ని వదిలి ఇళ్లను నిర్మించాలి. కానీ మురుగుకాల్వ పక్కనే స్థలం వదలకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఆటంకమేర్పడటమే కాకుండా, వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా పోతుంది. పలుచోట్ల జీఫ్లస్‌ టూకు అనుమతులు తీసుకొని మూడో అంతస్తు, ఆపై పెంట్‌హౌస్‌లు కట్టుకుంటున్నారు. వీరిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అధికారులు ఇళ్ల నిర్మాణదారులతో కుమ్మక్కవడం వల్లే ఇలా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి