BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 11:49 pm Posted by : Reporter Srikanth

పరకాల పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: ఎమ్మెల్యే రేవూరి

  • భీమ్ ఇండియ టుడే న్యూస్ పరకాల :వరంగల్‌ జిల్లా పరకాలను పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు చిరు వ్యాపారులు సహకరించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణ కేంద్రంలోని కూరగాయలు, చేపల మార్కెట్లను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మిగిలిపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. మార్కెట్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తామన్నారు. చేపల మార్కెట్ బయట ఉండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి నిర్దిష్టమైన ప్రదేశంలో మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారం చేసుకునే వారు జీవనాధారం కోల్పోకుండా ప్రత్యామ్నాయంగా నిర్దిష్టమైన ప్రదేశం కేటాయిస్తామని చెప్పారు. అదేవిధంగా పరకాల పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.