BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 11:23 am Posted by : Reporter Srikanth

పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు

 పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు
అనువైన స్థలాలను గుర్తించండి
క్యూఆర్” పరిధిలో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.
చిత్రంలో సీవీ ఆనంద్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వి. శేషాద్రి, అహ్మద్ నదీమ్,

భీమ్ ఇండియా టుడే హైదరాబాద్ : జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ‘క్యూఆర్’ లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా చూడాలని, దీనివల్ల నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు. బోధి పెవిలియన్‌లో శుక్రవారం క్యూఆర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల వివిధ శాఖలకు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి గుర్తించిన స్థలాలను తీసుకుని, వేరేచోట ఆయా శాఖలకు కేటాయించాలని సీఎం ఆదేశించారు. “క్యూఆర్ ఏరియా”లో పలు నియోజకవర్గాల పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. 400 చ.అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో రూ.5 లక్షల భారీ సబ్సిడీని అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలు లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. భూమి ధరను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. తొలిదశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పుర, అంబర్‌పేట, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మలక్‌పేట నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనుంది. సంబంధిత నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయండి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సమీక్ష సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, ఉన్నతాధికారులు వికాస్‌రాజ్, అహ్మద్ నదీమ్, ఎన్. శ్రీధర్, వి. శేషాద్రి, లోకేష్ కుమార్, సర్ఫరాజ్ అహ్మద్, వీపీ గౌతమ్, ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.