Date of Publish : 25 July 2026, 10:25 pmPosted by : Reporter Srikanth
ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
భీమ్ ఇండియా టుడే: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం (రి.నెంబర్ -327) రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలోని పళ్ల రవీందర్ రెడ్డి భవన్లో యూనియన్ కంపెనీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. సమ్మె విరమిస్తేనే చర్చలకు పిలుస్తామని చెప్పిన ప్రభుత్వం, యాజమాన్యం.. మూడు నెలలవుతున్నా చర్చలకు పిలువకపోవడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లినా కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యలను పరిష్కరించడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదన్నారు. ఐదు సంవత్సరాలకి ఇవ్వాల్సిన గ్రేడ్ ప్రమోషన్లను 8 సంవత్సరాలు గడుస్తున్నా అందించకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా ఒకే సంస్థలో రెండు సర్వీసు రూల్స్ ఉండవని ఆయన అన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా ఆర్టిజన్ ఉద్యోగులకు కూడా ఏపీఎస్పీబీ సర్వీస్ రూల్స్‌ను వెంటనే అమలు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, కంపెనీ సెక్రటరీ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ నరేందర్ రెడ్డి, కట్ల సదయ్య. తులసి రెడ్డి, దొరికల సదయ్య, మచ్చిక బుచ్చయ్య గౌడ్, చిట్ల ఓదేలు, యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పప్పు వెంకటేశ్వర్లు, ఆర్టిజన్స్ నాయకులు సలీం పాషా, కోరుకొప్పుల రాంబాబు, చింతలపూడి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.