భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్రా:-ష్ట్రంలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత వాటి నాణ్యత, సైజు ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేకరణ (ఫీడ్‌బ్యాక్) తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పంపిణీ, వాటి రంగులు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
విద్యార్థులకు యూనిఫాంల అందజేతపై ముఖ్యమంత్రి గారు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చదివే విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో రాజీపడబోమని స్పష్టంగా చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి పిల్లలందరికీ యూనిఫాం అందజేయాల్సినదేనని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే సహించనని హెచ్చరించారు. మహిళా సంఘాలు కుట్టు పని వేగవంతం చేసేలా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య గారికి సూచించారు.గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు యూనిఫాంల అందజేతలో అడ్డగోలుగా వ్యవహరించారని, మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నందున నాణ్యమైన యూనిఫాంలు అందిస్తామని అన్నారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
వచ్చే విద్యా సంవత్సరం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థులకు యూనిఫాం అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ గారు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ గారు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.